బాహుబలి... పోలీస్‌గిరి... | bahubali movie black ticket dandha | Sakshi
Sakshi News home page

బాహుబలి... పోలీస్‌గిరి...

Published Fri, Jul 10 2015 12:12 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

బాహుబలి... పోలీస్‌గిరి... - Sakshi

బాహుబలి... పోలీస్‌గిరి...

బంజారాహిల్స్: శుక్రవారం విడుదల కానున్న బాహుబలి చిత్ర టికెట్ల విషయంలో పోలీసులదే పైచేయి అయింది. పోలీసులను ప్రసన్నం చేసుకున్న వెస్ట్‌జోన్‌లోని థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు మాత్రం రిక్తహస్తాలను చూపించాయి. పశ్చిమ మండలం పరిధిలోని వీవీఐపీ జోన్‌లో ఉన్న రెండు ఠాణా పరిధిలో బాహుబలి టికెట్లను పోలీసులు పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. థియేటర్ల మేనేజర్లను హైజాక్ చేసి తలాకొన్ని టికెట్లు దక్కించుకున్నారు. ముఖ్యంగా వీవీఐపీ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐలంతా థియేటర్ల మేనేజర్లను ఊపిరాడకుండా చేసి తలా 20 టికెట్ల మేర లాక్కున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక కానిస్టేబుళ్ల అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. అసలే పెద్ద సినిమా కావడం, భారీ అంచనాలు ఉండటంతో సామాన్యులు పెద్ద సంఖ్యలో ఆయా థియేటర్ల వద్ద రెండు రోజుల ముందునుంచే బారులు తీరినా ఫలితం లేకుండా పోయింది. దొడ్డిదారుల్లో వచ్చిన పోలీసుబాసులు టికెట్లను గద్దల్లా తన్నుకుపోయారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా టికెట్ల కోసం పైరవీలు చేయడం గమనార్హం. ఇక తమను అడిగేవారు ఎవరూ లేరన్న ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు రెండు రోజుల నుంచే దాదాగిరితో టికెట్లను జేబుల్లో వేసుకున్నారు. అమాయక ప్రేక్షకులంతా ఏం జరిగిందో తెలుసుకునే సరికి థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. పోలీసులది ఒక దారి అయితే బ్లాక్ మార్కెట్ చేసే వారిది మరో దారి... ఒక్కో టికెట్‌ను రూ. 3 వేలకు విక్రయించారు. దీంతో కొన్ని థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళనలు కూడా చేశారు. కానీ ఒక్క చోట కూడా ఒక్క కేసు కూడా బుక్ కాకపోవడం విశేషం. ఒక వైపు బ్లాక్‌టికెట్ల విక్రయాలను అడ్డుకోవాల్సిన పోలీసులు అటుగా చూడకుండా టికెట్ల కోసం పైరవీలు చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులకు టికెట్లు దొరకకుండా పోయాయి.
 
బ్లాక్ టికెట్ల విక్రేత అరెస్ట్...
 మల్కాజిగిరి : బాహుబలి చిత్రం టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ హఫీజ్ కథనం ప్రకారం..  మల్కాజిగిరి రాఘవేంద్ర థియేటర్ వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు. దీనితో థియేటర్ వద్ద ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న రమేష్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద 123 టికెట్లు రూ.19,140 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరో నలుగురి పట్టివేత...
 జీడిమెట్ల: బ్లాక్‌లో బాహుబలి టికెట్లను విక్రయిస్తున్న నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్సై మాణిక్యం కథనం ప్రకారం.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగా థియేటర్, చింతల్‌లోని షా థియేటర్ వద్ద ఆటో డ్రైవర్ రాజు(33), నూర్ మహ్మద్(57), రాంబాబు(30), దుర్గేష్(32) బాహుబలి టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. వారి నుంచి వంద టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో టికెట్‌ను రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు పో లీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.

 మెగా, మహాలక్ష్మి థియేటర్లపై ఎస్‌ఓటీ దాడి..
 చైతన్యపురి: సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా, కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్లపై దాడి చేశార. ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు కథనం ప్రకారం... మెగా థియేటర్ ఆవరణలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న పి.ఆంజనేయులు (37), ఎల్.కృష్ణ (30)లను అదుపులోకి తీసుకుని 66 టికెట్లు, రూ.2820 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే థియేటర్ మేనేజర్ సత్యనారాయణగౌడ్‌తో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కొత్తపేట మహాలక్ష్మి థియేటర్‌పై కూడా దాడి చేసిన ఎస్‌ఓటీ పోలీసులు మొత్తం 1275 టికెట్లు, రూ.95,500 స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ విక్రంను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. థియేటర్ నిర్వాహకుడు సాంబశివరావు పరారీలో ఉన్నాడు.
 
 థియేటర్లపై చర్యలు తీసుకోవాలని  హోంమంత్రికి వినతి

 సాక్షి, సిటీబ్యూరో: బాహుబలి సినిమా విడుదల నేపథ్యంలో రూ. వంద విలువ గల టికెట్‌ను బ్లాక్‌లో రూ. 1000 నుంచి రూ. 3000ల వరకు విక్రయించి సినీ అభిమానులను దోచుకుంటున్న థియేటర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హోంమత్రి నాయిని నర్సింహారెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement