కళ్లుండీ చూడలేనివారే వ్యతిరేకం
పెద్దనోట్ల రద్దుపై దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కళ్లుండీ చూడలేనివారే పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పెద్దనోట్ల రద్దు–నగదు రహిత లావాదేవీలపై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని చెప్పారు. అందుకే పెద్దనోట్ల రద్దు వంటి కఠినచర్యలను తీసుకున్నారని తెలిపారు. దేశంలో రూ.1000 కోట్లు ఖర్చుపెడితే క్షేత్రస్థాయిలో రూ.300 కోట్ల పనులు మాత్రమే జరుగుతున్నాయన్నారు.
అంటే 70 శాతం ప్రజాధనాన్ని రాజకీయనాయకులు, కాంట్రాక్టర్లు దోచుకుతింటున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. నగదు రహిత లావాదేవీలు జరిగితే అవినీతిని నియంత్రించడానికి అవకాశముంటుందన్నారు. అవినీతిని అరికట్టి, నల్లధనంలేకుండా చేయగలిగితే దేశంలో పేదరికం తగ్గుతుందన్నారు. దేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్‌పార్టీ ఇప్పటిదాకా దేశ ప్రజలను ఉచిత హామీలతో, ప్రలోభాలతో మోసంచేసిందని దత్తాత్రేయ విమర్శించారు. ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు, చెబుతున్న మాటలు కొందరికినచ్చకపోవచ్చునన్నారు. ప్రధాని చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నదని దత్తాత్రేయ అన్నారు.