సరైన సమయంలోనే నోట్ల రద్దు
ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో నిర్ణయం తీసుకున్నాం
- సర్జికల్ దాడులు భారీ విజయం
- లోక్‌సభలో చర్చకు మోదీ సమాధానం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సరైన సమయంలోనే తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం అందుకు తగిన సమయమని పేర్కొన్నారు. నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని ఆ నిర్ణయానికి ఎంచుకున్న సమయంపై తొలిసారిగా వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన మంగళవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. వివిధ అంశాలపై మోదీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పేదల ప్రయోజనం కోసం..
నోట్ల రద్దు నిర్ణయాన్ని సరైన సమయంలోనే తీసుకున్నాం. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది కనుక అది మంచి సమయం. బలహీనంగా ఉండుంటే దాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఉండకపోయేవాళ్లం. రోగికి అన్ని పరీక్షలు చేసి, పరిస్థితి బావుందని నిర్ధారించుకున్నాకే డాక్టర్ ఆపరేషన్ చేస్తారు. మోదీ దేన్నీ హడావుడిగా చేయడు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించేందుకే నోట్ల నిబంధనలు పలుమార్లు మార్చాం. యూపీఏ ప్రభుత్వంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 1,035 సార్లు నిబంధనలు మార్చారు. మనం సరైన దారిలోనే వెళ్తున్నామని నాకు అనిపిస్తోంది.
సర్జికల్ భారీ విజయం
పీఓకేలో చేసిన సర్జికల్ దాడులు మనకు భారీ విజయం. వాటిపై ప్రజలకు మీరేమీ చెప్పలేరు కాబట్టి అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని నన్ను అడిగిన వారున్నారుగాని, సర్జికల్ దాడులను రహస్యంగా ఎందుకు ఉంచారని ఎవరూ అడగలేదు. శక్తిమంతమైన భారత సైన్యానికి దేశాన్ని కాపాడుకునే సత్తా ఉంది.
నగదుతో అవినీతి మొదలు..
కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నందుకు నాకు ఇబ్బందులొస్తాయని తెలుసు. నల్లధనాన్ని వెనక్కి తెప్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. మేం 2014లో అధికారంలోకి రాగానే సుప్రీం ఆదేశాల ప్రకారం సిట్‌ను ఏర్పాటు చేశాం. బినామీ చట్టాన్ని పటిష్టం చేసి, రియల్ ఎస్టేట్ బిల్లు తెచ్చాం. రూ. 2 లక్షలకుపైబడిన లావాదేవీలకు పాన్ నంబర్‌ను తప్పనిసరి చేశాం. ఇదంతా రాజకీయ ప్రయోజనం కోసమే అయితే అది మీరు(కాంగ్రెస్) చేసి ఉండేవారు. నల్లధనం ఆభరణాలు, ఆస్తుల రూపంలో ఉందన్న ఖర్గే(విపక్ష నేత)తో ఏకీభవిస్తున్నా. అవినీతి.. నగదుతో మొదలై నగలు, ఆస్తులుగా మారుతుంది. 1988లో తెచ్చిన బినామీ చట్టాన్ని అప్పుడే నోటిఫై చేసి ఉంటే అవినీతి నిర్మూలన దిశగా ముందడుగు పడి ఉండేది. నోట్ల రద్దుపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ జరిగితే నరేంద్ర మోదీకి కలిసొస్తుందని మీరు భావించారు. అందుకే చర్చించకుండా టీవీ చానళ్లతో మీరు మాట్లాడారు. ఈసారైనా చర్చపై మీరు ఆసక్తి చూపడం బాగుంది. ఒకపక్క రాజీవ్ గాంధీ దేశాన్ని డిజిటలైజేషన్ చేశారంటున్న కాంగ్రెస్ మరోపక్క దేశంలో చాలామందికి మొబైల్ ఫోన్లు లేవని చెబుతోంది(నగదు రహితంపై కాంగ్రెస్ ప్రశ్నలకు బదులుగా) నాకు ముందు ఎవరూ ఏమీ చేయలేదని చెప్పేవాణ్ని కాదు నేను.
అదే తేడా..
పని సంస్కృతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా ఉంది. బొగ్గు, 2జీ ఇతర స్కాంలలో ఎంత డబ్బు పోయిందని యూపీఏ హయాంలో చర్చలు జరిగేవి. మోదీ ఖజానాకు ఎంత డబ్బు తెచ్చారని ఇప్పుడు చర్చించుకుంటున్నారు.. కడ దాకా సుఖంగా బతకాలన్నదే మీ సిద్ధాంతం.
మీ ప్రజాస్వామ్యం దేశానికి తెలుసు..
ఈ పార్టీ(కాంగ్రెస్) ప్రజాస్వామిక సంప్రదాయం ఏమిటో దేశానికి బాగా తెలుసు(కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడినందువల్లే పేదకుటుంబం నుంచి వచ్చిన మోదీ ప్రధాని కాగలిగారన్న ఖర్గే వ్యాఖ్యలపై). ఎమర్జెన్సీని తెచ్చి, దేశాన్ని జైలును చేసిన 1975 అందరికీ గుర్తుంది. కానీ వారికి(కాంగ్రెస్) ప్రజాశక్తి ఏమిటో తెలియలేదు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేలా వారిని(ఇందిర సర్కారును) ఒత్తిడి చేసింది జనశక్తే. ప్రజల, ప్రజస్వామ్య శక్తి వల్లే పేదరికం నుంచి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధాని కాగలిగారు.
కాంగ్రెస్‌కు ముందే త్యాగాలున్నాయి..
కాంగ్రెస్ పుట్టకముందే దేశ స్వాతంత్య్రం కోసం లక్షలాది ప్రజలు త్యాగాలు చేశారు (1857 తిరుగుబాటును ప్రస్తావిస్తూ). మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై బలిదానాలు చేశారు. సభలోని చాలామంది స్వాతంత్య్రం తర్వాత పుట్టారు. మనకు ప్రాణాలర్పించే అవకాశం లేకున్నా దేశ హితం కోసం జీవించే అవకాశం ఉంది.
రాహుల్ చెప్పిన భూకంపం వచ్చింది
మోదీ అవినీతి సమాచారం తన దగ్గరుందన్న రాహుల్‌కి మోదీ చురక అంటించారు. ఎట్టకేలకు భూకంపం వచ్చిందని సోమవారం ఉత్తరాదిలో వచ్చిన భూకంపాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. ‘మొత్తానికి భూకంపమొచ్చింది. ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నా. ఈ ముప్పు గురించి చాలా కాలం కిందట విన్నాను.. భూమాత అంతగా ఆగ్రహించడానికి తప్పకుండా కారణం ఉంటుంది. ఎవరైనా స్కాంలలో కూడా సేవ, వినయం చూసినప్పుడు తల్లి మాత్రమే కాకుండా భూమాత కూడా ఆందోళనపడుతుంది. భూకంపాలు వస్తాయి’ అని అన్నారు.
విషాదాన్ని ఎగతాళి చేస్తున్నారు: రాహుల్
నోట్ల రద్దుపై మోదీ సమాధానాలు చెప్పకుండా ఉత్తరాఖండ్ భూకంప విషాదాన్ని గేలి చేస్తున్నారని, స్వాతంత్య్రోద్యమాన్ని అవమానిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. నకిలీ వైద్యుడితో ప్రాణాలకు ముప్పు ఉంటుందంటూ ఆర్థిక వ్యవస్థపై మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.