కేంద్ర వ్యవసాయ విద్య, పరిశోధన శాఖ కార్యదర్శి మహాపాత్ర వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మోన్‌శాంటో బీటీ విత్తన కంపెనీ దేశం విడిచి వెళ్లిపోదని... ఇంత పెద్ద మార్కెట్‌ను అది కోల్పోదని కేంద్ర వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అభిప్రాయపడ్డారు. మోన్‌శాంటో దేశం విడిచి వెళ్లిపోయినా నాగపూర్ పత్తి పరిశోధన కేంద్రంలో ప్రత్యామ్నాయ బీటీ పత్తి విత్తనం తయారు చేస్తున్నామని అన్నారు. భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్) శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. మోన్‌శాంటో వెళ్లిపోతే బీటీ కాటన్‌పై గుత్తాధిపత్యం పోతుందన్నారు. ఒక కంపెనీ గుత్తాధిపత్యంపై ఇంతలా ఆధారపడటం సరైన పద్ధతి కాదన్నారు. దేశంలో రాత్రికి రాత్రే అనేక పత్తి విత్తన కంపెనీలు పుట్టుకొచ్చాయన్నారు. 1,500 హైబ్రీడ్లు తయారయ్యాయన్నారు.
చిరుధాన్యాల ఉత్పాదకతను పెంచాలి
దేశంలో చిరుధాన్యాల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని మహాపాత్ర అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఈ పంటలను ప్రోత్సహించాలన్నారు. వచ్చే ఐదేళ్లలో పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో విత్తన వెరైటీలను తీసుకొస్తున్నామన్నారు. విత్తన హబ్‌లను తయారుచేయనున్నట్లు తెలిపారు.
వేగంగా వాతావరణంలో మార్పులు
కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విత్తనాలను తయారు చేస్తున్నామన్నారు. ‘సౌబాగాదాన్’ వెరైటీ వరి విత్తనం 14 రోజులు వరదల్లో మునిగిపోయినా ఆ పంట పాడైపోదన్నారు. ఐఐఆర్‌ఆర్ డెరైక్టర్ రవీంద్రబాబు మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో పంటలు పండించేలా వంగడాలు తయారు చేస్తున్నామన్నారు. డిప్యూటీ డెరైక్టర్ జనరల్ జేఎస్ సంధు తదితరులు పాల్గొన్నారు.
బీటీ పత్తి విత్తనానికి దేశీయ ప్రత్యామ్నాయం
Published Sun, Mar 27 2016 3:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM
Advertisement