హైదరాబాద్ : బేగంపేట-బల్కంపేట లింక్ రోడ్డు ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఈ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన ఐడీహెచ్ కాలనీలో మోడల్ హౌసింగ్ కాలనీకి శంకుస్థాపన చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీకి సంబంధించి సీఎం తొలిసారి పాల్గొన్న అధికార కార్యక్రమాలు ఇవి.
ఇక బేగంపేట-బల్కంపేట లింకు రోడ్డు వల్ల కూకట్‌పల్లి, బాలానగర్, ఫతేనగర్, బల్కపేటల నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. బల్కంపేట, బృందావన్ కాలనీ, ఫతేనగర్ మధ్య లింక్ ఏర్పడుతుంది. బ్రాహ్మణవాడి, బేగంపేట, నేచర్ క్యూర్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఇందిరాగాంధీపురం, రేణుకానగర్ ప్రజలకు ఎంతో సౌలభ్యం కలుగుతుంది.
సికింద్రాబాద్, మారేడ్‌పల్లి ప్రాంతాల నుంచి రాజీవ్ సర్కిల్, గ్రీన్‌ల్యాండ్ ఫ్లై ఓవర్ల వైపు వెళ్లేవారికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. అమీర్‌పేట నుంచి సనత్‌నగర్, కూకట్‌పల్లి వెళ్లే వారికి కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ఈ రోడ్డును 1.41 కి.మీ. పొడవు, 18 మీ.(నాలుగు లేన్లు) వెడల్పుతో రూ.45 కోట్లుతో నిర్మించారు. కాగా ఈ లింక్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రావటానికి సుమారు ఏడేళ్ల సమయం పట్టింది.
బేగంపేట-బల్కంపేట లింక్ రోడ్ ప్రారంభం
Published Fri, Oct 3 2014 10:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement