వరద మృతులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వర్షాలతో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రాణనష్టం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికే అసాధారణ వర్షాలు కురవడంతో పాటు ఇంకా వర్షసూచన ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి బుధవారం ఉదయం మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో మాట్లాడారు.
నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని, ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని సీఎం అన్నారు. బస్తీల్లోకి వరద నీరు రావటంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని మరోచోటుకి తరలించాలని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్‌ను, అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించటంతో పాటు ఇతర సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పోలీస్ కమిషనర్‌కు సూచించారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్(21111111)కు అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు.