హైదరాబాద్ : ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం జనసంద్రమైంది. వేలాదిమంది విద్యార్థులు, నాయకులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు, అధికారులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకేచోట వేలాదిమంది విద్యార్థులు కేరింతలు కొడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ జిందాబాద్.. అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. విద్యార్థుల కేరింతలకు తోడు జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి కామెడీ తోడవడంతో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో సంబరం అంబరాన్నంటింది.
ఓ పక్క విద్యార్థుల కేరింతలు, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ కవిత్వ గానం, కవి దేశపతి శ్రీనివాస్ పాటలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ఆట పాటలకు రాజకీయ నాయకులు, విద్యార్థులు సైతం స్టెప్పులు వేసి సందడి చేశారు. ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం ఉదయం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2018 కార్యక్రమం విద్యార్థుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది.
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రజలు సహకరిస్తేనే విశ్వనగరం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. హైదరాబాద్ స్వచ్ఛతకు మారు పేరని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే దేశంలో స్వచ్ఛతలో మనమే మొదటి స్థానం సాధిస్తామన్నారు. ప్రజలు సహకరించినప్పుడే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందన్నారు.
మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి పని చరిత్ర సృష్టించిందన్నారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేసి అందజేసిన వారికి తీసిన డ్రాలో గెలుపొందిన ముత్యాల్‌కు ఐటీసీ కంపెనీ రూ.లక్ష బహుమతి, మరొకరికి యాక్సిస్ బ్యాంకు రూ.70 వేల చెక్కును అందించింది. అనంతరం ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యాదగిరిరావు నేతృత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై రూపొందించిన జీహెచ్‌ఎంసీ సాంగ్‌ను నాయిని విడుదల చేశారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలు..
ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ విద్యార్థులు, అధికారులు, అనధికారులు, కవులు, కళాకారులతో స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రతిజ్ఞను చేయించారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 64 కిలోల కేక్‌ను కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment