
ఉద్యమాలకు భాగ్యరెడ్డి వర్మ ఆదర్శం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భాగ్యరెడ్డి వర్మలు సమకాలికులని, దళితులు విద్యను అభ్యసించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తించి వారు విద్యాలయాలు స్థాపించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
- మల్లెపల్లి లక్ష్మయ్యకు భాగ్యరెడ్డి వర్మ పురస్కారం ప్రదానం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భాగ్యరెడ్డి వర్మలు సమకాలికులని, దళితులు విద్యను అభ్యసించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమని గుర్తించి వారు విద్యాలయాలు స్థాపించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రజా ఉద్యమాలకు భాగ్యరెడ్డి వర్మ ఆదర్శమని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ 128వ జయంతిని పురస్కరించుకుని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, భాగ్యరెడ్డి వర్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్యకు భాగ్యరెడ్డి వర్మ అవార్డును ప్రదానం చేశారు.
అంతకు ముందు చాదర్‌ఘాట్‌లోని ఆది హిందూ భవన్‌లోని పాఠశాలలో భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి కడియం పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు లైబ్రరీ, కంప్యూటర్ గదిని ఆయన ప్రారంభించారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. వర్మ తెలంగాణలో గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త, దళిత జనోద్ధారకుడని కొనియాడారు. విద్య ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమని గుర్తించిన భాగ్యరెడ్డి వర్మ వందేళ్ల క్రితమే 26 పాఠశాలలను దళితుల కోసం నెలకొల్పారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మను అప్పటి ప్రభుత్వాలు గుర్తించలేదని, నేడు తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ జయంతిని ఏటా నిర్వహించేలా ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని లీగ్ సభ్యులకు సూచించారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని, తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, జేబీ రావు, జ్ఞాన్‌ప్రకాశ్, ట్రస్ట్ కన్వీనర్ ఆవుల బాలనాదం, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రాహుల్ అమోలక్ శాస్త్రి, గౌతమ్, దేవదాసు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.