బీడీ కార్మికుడికి పుట్టిన ‘ఐసిస్’ ఉగ్రవాది | birth of Beedi Workers 'Isis' terrorist | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికుడికి పుట్టిన ‘ఐసిస్’ ఉగ్రవాది

Published Mon, Feb 1 2016 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

బీడీ కార్మికుడికి పుట్టిన  ‘ఐసిస్’ ఉగ్రవాది

బీడీ కార్మికుడికి పుట్టిన ‘ఐసిస్’ ఉగ్రవాది

బీడీ కార్మికుడికి పుట్టిన అబు అన్స్
పిల్లల కోసం కడుపుకాల్చుకున్న తండ్రి
‘ఐసిస్’ ఉగ్రవాది కుటుంబ వ్యవహారమిది
కీలకంగా మారిన సిటీలో ఖాలిద్ కదలికలు

 
సిటీబ్యూరో: అతడో బీడీ కార్మికుడు... రాజస్థాన్‌లోని ఓ పట్టణంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. తన కుమారులకు బంగారు భవితనివ్వాలని అనునిత్యం తపన పడ్డాడు. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల్నీ ‘ధిక్కరించి’ మరీ తన కుమార్తె  ఉన్నత విద్యనభ్యసించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారనే ఆరోపణలపై ఎన్‌ఐఏ అధికారులు శనివారం అరెస్టు చేసిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సభ్యుడు అబు అన్స్ తండ్రి అంజద్ ఖాన్ వ్యవహారమిది. జైపూర్‌కు 85 కిమీ దూరంలో ఉన్న టోంగ్ పట్టణంలోని మొహల్లా బథ్వాలన్ ప్రాంతానికి చెందిన అంజద్ ఖాన్ ఓ బీడీ తయారీ సంస్థలో కార్మికుడు. ఇలా వచ్చే చిరు ఆదాయంతోనే ముగ్గురు కుమారులు, కుమార్తెకు మంచి జీవితం ఇవ్వాలని భావించాడు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ తన దైనందిన అవసరాలను సైతం తగ్గించుకుంటూ వచ్చాడు.

పెద్దవాడైన అబు అన్స్‌ను జైపూర్‌లోని జేవీసీఆర్సీ యూనివర్సిటీ నుంచి మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేయించాడు. కొన్ని సాఫ్ట్‌వేర్ కోర్సులు చేయించి ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు పంపాడు. మిగిలిన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇటీవలే బీటెక్ పూర్తి చేయగా... మరొకరు డిగ్రీ తరవాత జైపూర్‌కు వచ్చి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. మైనార్టీలు ఎక్కువగా నివసించే మొహల్లా బథ్వాలన్‌లో యువతులు స్కూలు విద్యను దాటడమే గొప్ప విషయం. అలాంటి అంశాలనూ పట్టించుకోని అంజద్ తన కుమార్తెను సైతం బీఎస్సీ పూర్తి చేయించి, ఉన్నత చదువులకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన అబు తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో సైబర్ సెక్యూరిటీకి సంబధించిన క్రాష్ కోర్సులు చేశారు.  ఆ తర్వాత అబిడ్స్  గన్‌ఫౌండ్రీ చౌరస్తాలో ఉన్న టెక్నో వరల్డ్ గ్రూప్ (టీడబ్ల్యూజీ) సంస్థలో అప్రెంటీగా చేరారు. అది పూర్తయ్యాక అదే సంస్థలో గతేడాది జూన్ నుంచి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్న అబు బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ ఆరోపించింది. గత నెల 25 నుంచి అబు విధులకు హాజరుకావట్లేదని, అరెస్టు విషయం తెలిసి నమ్మలేకపోయామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఈ సంస్థ ఓ రాజకీయ ప్రముఖుడికి చెందినదిగా తెలిసింది. కుమారుడు అరెస్టు  విషయం తెలుసుకున్న అంజద్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. అయితే అబు అన్స్‌ను ఢిల్లీ ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నట్లు తెలిసుకుని అక్కడకు వెళ్లారు.

ఖాలిద్ సిటీకి ఎందుకొచ్చాడు?
ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో గతేడాది చిక్కిన రిజ్వాన్ నిజాముద్దీన్ అలియాస్ ఖాలిద్ కదలికలు హైదరాబాద్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యూపీలోని ఖుషీనగర్ జిల్లా కాల్యాకు చెందిన ఖాలిద్ ముంబైలోని మాల్వనీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల్ని ఐసిస్ వైపు ఆకర్షించాడనేది ప్రధాన ఆరోపణలు వీరిలో ముగ్గురు సిరియా వెళ్లి తిరిగి వచ్చి పోలీసులకు పట్టుబడగా... మరో యువకుడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గతనెల 30న ఖాలిద్‌ను అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేంచిన నేపథ్యంలోనే ఇతడి కదలికలు హైదరాబాద్‌లోనూ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నిఘా విభాగాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన నలుగురి ఉగ్రవాదులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయా? లేక ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా నగరం దాటి సిరియాకు వెళ్లిపోయినట్లు భావిస్తున్న ఐదుగురి అంశానికి సంబంధించిందా? అనే దానిపై దృష్టి పెట్టారు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాదుల్ని మంగళవారం నుంచి కస్టడీలోకి తీసుకోనున్న ఎన్‌ఐఏ.. హైదరాబాద్‌కు చెందిన వారిని ఈ కోణంలోనూ ప్రశ్నించనుంది. ‘జునూద్’ చీఫ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటూ శుక్రవారం ముంబైలో అరెస్టు అయిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్‌కు ఖాలిద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement