'టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి'
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మనోహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం కేసీఆర్ ఆశలు కల్పించారని, వడ్డీలు కూడా మాఫీ చేయక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని లక్ష్మణ్ అన్నారు. ఫసల్ బీమా వంటి పథకంలో ప్రభుత్వం కనీసం భాగస్వామి కాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు లేదని, ప్రభుత్వంలో చలనం లేదని ఆయన మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వందేళ్లు కావస్తుండగా పెద్ద సంఖ్యలోని ఖాళీలను భర్తీ చేయకపోగా జాతీయస్థాయి (న్యాక్) గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.