దోచుకున్నది పోతుందనే: లక్ష్మణ్
హైదరాబాద్: నల్లధనం, నకిలీ నోట్ల చెలామణి అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని దేశ ప్రజలంగా అభినందిస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం వారి దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాల ద్వారా ప్రజలను తప్పుదోవపట్టిస్తుందని.. ఈ ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
బొగ్గు స్కామ్, 2జీ స్కామ్, కామన్వెల్త్ క్రీడల స్కామ్లతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన కాంగ్రెస్ నాయకులు పెద్ద నోట్ల రద్దుపై ధర్నాలు చేయడాన్ని ప్రజలు అసహ్వించుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల బాధంతా తాము దోచుకున్న డబ్బుకు ఎసరొచ్చిందనే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పాలనలో నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతికి వ్యతిరేకంగా ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేదో ప్రజలకు తెలియజెప్పే ధైర్యం వారికి లేదన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా నగదు ప్రజలకు అందించే ప్రయత్నం జరుగుతుందని.. ప్రధాని తీసుకున్న చర్యతో దీర్ఘకాలంలో దేశానికి మంచి జరుగుతుందని ఆయన తెలిపారు.