నిత్య రక్తదాత.. నీకు సలాం
ఆయనేమీ సెలబ్రిటీ కాదు. కానీ జాతీయ ఛానెళ్లు సైతం ఆయన ఇంటికి వచ్చి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఆయనేమీ సూపర్ హీరో కాదు. అయినప్పటికీ ఇటీవల ముంబైకి చెందిన లివ్ కెమిస్ట్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. రవీంద్రభారతిలో జరిగే సన్మాన గ్రహీతల్లో ఎప్పుడూ ఆయన పేరు చూసి ఉండకపోవచ్చు. కానీ.. గవర్నర్ల చేతుల మీదుగా ఏకంగా 17 గోల్డ్ మెడల్స్ అందుకున్న ఘనత ఆయనది. రక్తదాతగా పెద్ద రికార్డులు సృష్టించిన నగరంలోని ఓ చిన్న మెడికల్ షాప్ ఓనర్ ప్రస్థానమిది.
- ఎస్.సత్యబాబు
60 ఏళ్ల వరకూ దానం చేస్తా..
101 సార్లు దానం చేశాక ఆపేద్దామని మొదట అనుకున్నా. ఆ తర్వాత 111 అనుకున్నా. కానీ ఇప్పుడు 60 ఏళ్ల వరకూ ఇవ్వొచ్చు కదా అనిపిస్తోంది... అందుకే కొనసాగిస్తాను. నా ఇద్దరు కుమార్తెలు కూడా రక్తదానం చేస్తామంటున్నారు. 19 ఏళ్ల తర్వాత వారితోనూ చేయిస్తా. రెడ్‌క్రాస్ ద్వారా 17 గోల్డ్ మెడల్స్ అందుకున్నాను. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. నా దేహాన్ని కూడా దానం చేశా. - యోగేష్
సిటీలోని డీడీ కాలనీలో నివాసముండే యోగేష్ శ్రీవాస్తవ(51 ) ఫోన్ నెంబరు చాలా ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో, వైద్యుల దగ్గర తప్పకుండా ఉంటుంది. ఒక్క కాల్ చేస్తే చాలు పరుగున వచ్చి రక్తదానం చేస్తారనే పేరున్న ఈయన, కాల్ రాకపోయినా ఊరుకునే రకం కాదు. రెడ్‌క్రాస్‌కు వెళ్లి మరీ రక్తం దానం చేస్తారు. ‘1983 అక్టోబర్ 2న తొలిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి మూడు నెలలకొకసారి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నా’నంటూ వివరించాడీ రక్తదాత. యోగేష్ ఇప్పటికి వందసార్లకు పైగా రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ‘తొలిసారి రక్తదానం చేసినప్పుడు ‘ఈ రోజు మీరు ఇద్దరికి ప్రాణదానం చేశార’ని డాక్టర్ చెప్పారు. అది నాకెంతో ఆనందానిచ్చింది. ఆర్థిక సహాయం చేయలేని నేను రక్తదానం చేసి తోటివారికి సాయపడొచ్చని తెలిసిదంటా’రు దూద్‌బౌలిలో మెడికల్ షాప్ నిర్వహించే యోగేష్.
ఆరోగ్యకరమైన అలవాటు..
‘ఉదయం 6 గంటలకు వాకింగ్ చేస్తాను. రాత్రి వరకు మెడికల్ షాప్‌లో ఉంటాను. రోజుకు 14 నుంచి 15 గంటలు పని చేస్తాను. ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు’ అని చెప్తున్న యోగేష్.. రక్తదానం ఆరోగ్యకరమైన అలవాటంటారు. ‘పెళ్లయిన కొత్తలో నా భార్య రక్తదానానికి అడ్డు చెప్పింది. అయితే మేం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక మహిళ ఎదురుపడి.. ‘ఈ రోజు నేను బతికున్నానంటే అది మీ భర్త వల్లేన’ని ఆమెకి చెప్పింది. ఆ తర్వాత ఇక తనెప్పుడూ నాకు అడ్డు చెప్పలేదు. రక్తదానంపై పూర్తి అవగాహన వచ్చిందామెకి. ఇప్పుడు రక్తం దానం చేసే సమయాన్ని ఆమే నాకు గుర్తు చేస్తుంటుంద’ని చెప్పారు యోగేష్.