
కొడుకు ప్రేమకు తండ్రే విలన్..
కొడుకు ప్రేమ కథలో తండ్రి విలన్‌గా మారాడు.
కొడుకు ప్రేమ కథలో తండ్రి విలన్‌గా మారాడు... కుమారుడు తన నుంచి దూరం కావడానికి అతడు ప్రేమించిన యువతే కారణమని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నకిలీ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి అందులో ఆ యువతి ఫొటో పెట్టి.. కొన్ని అసభ్యకర చిత్రాలు అప్‌లోడ్ చేశాడు.
సదరు యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అదనపు క్రైమ్ డీసీపీ జి.జానకీషర్మిల బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... చందానగర్‌కు చెందిన రాపోలు ప్రభాకరావు కొడుకు సందీప్ (22) ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.అదే కంపెనీలో పనిచేసే యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని, అందుకు అంగీకరించాలని తండ్రి ని కోరగా.. ససేమిరా అన్నాడు.
దీంతో తండ్రితో గొడవపడిన సందీప్ గతేడాది నవంబర్ రెండో వారంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొడుకు తనకు దూరం కావడానికి యువతే కారణమని భావించిన ప్రభాకరరావు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. రుద్రప్రభు అనే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచాడు. అందులోని ప్రొఫైల్‌లో తన ఫొటోకు బదులు ఆ యువతి ఫొటో పెట్టాడు. అంతేకాకుండా అసభ్యచిత్రాలను అందులో అప్‌లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి సైబర్‌క్రైమ్ ఏసీపీ ప్రతాప్‌రెడ్డిని ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ జయరాం దర్యాప్తు చేసి చివరకు నిందితుడు ప్రబాకర్‌రావును గుర్తించి అరెస్టు చేశారు.