హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్, అసెంబ్లీ వీడియో లీకేజీలపై కమిటీ సమీక్షించింది. సుమారు మూడు గంటలపాటు అసెంబ్లీలో పలు వీడియోలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. శీతాకాల సమావేశాల్లో ఐదో, ఆరో రోజు జీరో అవర్లో లేవనెత్తిన వీడియోలను కమిటీ నేడు పరిశీలించింది.
అయితే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయాక కూడా ఈ భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించిన విషయం అందరికీ విదితమే. ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్‌సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులు.