అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కనీసం తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం తమకు కల్పించలేదని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తన విక్షణాధికారంతో ముందుకు పోయిందని, కేవలం పార్టీ ఫిరాయించిన వాళ్లను కాపాడే ఉద్దేశంతోనే ఇలా చేసిందని ఆయన అన్నారు. కనీసం ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినా బీఏసీలో ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఇది అనైతిక, అప్రజాస్వామిక విధానమని, చెడు సంప్రదాయాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.
అయితే తాము నోటీసు ఇచ్చాము కాబట్టి చర్చలో పాల్గొంటామని ఆయన తెలిపారు. చర్చలో పాల్గొనేందుకు కొంత సమయం కావాలని, అలాగే శాసన సభ్యులకు సమాచారం అందించాల్సి ఉందని చెప్పినా.. ఇప్పటికిప్పుడే దీనిపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినరోజే దానిపై చర్చ చేపట్టడం జరగదు. ఫోన్లు చేశామని, అది కాక ఇంకా ఈమెయిల్, ఎస్ఎంఎస్, టెలిగ్రామ్ లాంటి అన్ని మార్గాలలోను విప్ జారీ చేసినట్లు ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని అందులో తెలిపామన్నారు. విప్ జారీచేసిన దానికి అనుకూలంగా సభ్యులు ఉండాలని తెలిపామని, దానికి ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
పార్టీ ఫిరాయింపుదారులను కాపాడేందుకే..
Published Mon, Mar 14 2016 11:58 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM
Advertisement