
ఇకపై ఏడాదికి ఒకేసారి ‘ఆసరా’!
బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేయనున్న ఆర్థికశాఖ
సాక్షి, హైదరాబాద్: పింఛన్ల పంపిణీలో ఏర్పడుతున్న తీవ్ర జాప్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాది కాలానికి సంబంధించిన పింఛన్ల మొత్తానికి ఒకేసారి బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వు(బీఆర్వో)లను జారీ చేయాలని సర్కారు తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు రేపో మాపో ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం మేరకు మే నుంచి ప్రతినెలా పింఛన్‌లను 10వ తేదీలోగానే పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాస్తవానికి మార్చి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఏప్రిల్ నెల సగమైపోయినా ఇంకా ప్రారంభం కాలేదు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీని ప్రారంభించాలంటే, అంతకు ముందు నెలలో కనీసం 20 లోగానే బీఆర్వోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ, పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో పింఛన్‌దారులకు అవస్థలు తప్పడం లేదు.