
ఉప ఎన్నికకు వెళ్దామా..
-మున్సిపల్స్ తేలటంతో.. ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌లో చర్చ
-సనత్‌నగర్‌లో మంత్రులు కేటీఆర్, తలసాని పర్యటనలు
-తలసాని రాజీనామా ఆమోదిస్తే.. అదేబాటలో మరో ముగ్గురు ఎంఎల్‌ఏలు
సాక్షి, సిటీబ్యూరో: మున్సిపల్స్ తెలిసిపోయింది. నగర జనం అధికార టీఆర్‌ఎస్‌కు వెంట నడవటంతో అధికార టీఆర్‌ఎస్‌లో కొత్త చర్చకు తెర లేచింది. టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికకు సిద్ధమయ్యే దిశగా ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి.
ఆ దిశగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీబస్తీతోపాటు బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్‌బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే గ్రేటర్‌లో పదహారు శాసనసభ నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచిన టీఆర్‌ఎస్ సనత్‌నగర్‌లో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ వద్ద ఉన్న రాజీనామా అంశం తెరమీదకు వచ్చే అవకాశం ఉందని... దాంతో ఓ వేళ జరిగితే ఇదే స్పూర్తితో పనిచేయాలని క్యాడర్కు ఇప్పటికే సాంకేతాలు వెళ్లినట్లు సమాచారం.
తలసానితో పాటు..ఆ ముగ్గురివి కూడా
ఒక వేళ సనత్‌నగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.... దీనితో పాటు కూకట్‌పల్లి, మహేశ్వరం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ టీఆర్‌ఎస్‌లోని ముఖ్య నేతల్లో జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా కూకట్‌పల్లి నుండి మాధవరం కృష్ణారావు, మహేశ్వరం నుండి తీగల కృష్ణారెడ్డి, కంటోన్మెంట్ నుంచి సాయన్న విజయం సాధించారు.
అనంతరం వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో కృష్ణారావుకు 2014లో ఎంఎల్‌ఏగా 43186 ఓట్ల మెజారిటీ వస్తే, తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోకజవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ 46014 ఓట్లు. అంటే 2014తో పోలిస్తే అదనంగా 2828 ఓట్లు అధికం.
ఇదే సనత్‌నగర్‌కు వచ్చే సరికి 2014లో తలసానికి 27,461 ఓట్ల మెజారిటీ రాగా, తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మొత్తం 59,784 ఓట్లు వచ్చాయి. ఇవి టీడీపీ,బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే సుమారు 25916 ఓట్లు అధికం. ఇదే పరిస్థితి మహేశ్వరం నియోజకవర్గంతో పాటు, కంటోన్మెంట్‌లోనూ కనిపించింది.
పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహిస్తున్నామన్న అపవాదు లేకుండా ఉండేందుకు తలసానితో పాటు మిగిలిన చోట్ల కూడా ఉపఎన్నికకు వెళ్లే అవకాశాన్ని టీఆర్‌ఎస్ సీరియస్‌గానే పరిశీలించే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు సూత్రప్రాయంగా అంగీకరించారు. శనివారం రాత్రి సాక్షితో సదరు నేత మాట్లాడుతూ ప్రజలంతా మా పక్షమే ఉన్నారని గ్రేటర్ ఎన్నిక ద్వారా రుజువు అయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు.
అందుకే ఉపఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అయితే తరచూ ఎన్నికలకు తమ అధినేత, సీఎం కేసీఆర్ విముఖత చూపిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని తెలడంతో ... ఉపఎన్నిక అవసరం ఏ మేరకు ఉంటుందన్న అంశాన్నీ కేసీఆర్ పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ ఉందని సదరు టీఆర్ఎస్ ముఖ్యనేత అన్నారు.