మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం నుంచి వరుస సమావేశాలు నిర్వహించనుంది.
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తమ కార్యాచరణను వేగవంతం చేసింది. తొలి సమావేశం హైదరాబాద్లో బుధవారం జరిగింది. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం, ఈటల, జూపల్లి, తుమ్మల భేటీయ్యారు. కొత్త జిల్లాల సంఖ్య, ఏర్పాటు, జిల్లాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
కేబినేట్ సబ్ కమిటీ శుక్రవారం నుంచి వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఈ నెల 12, 13, 16 తేదీల్లో ప్రజాప్రతినిధులు, 17న కలెక్టర్లు, 18న అఖిల పక్షం, ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతారు. రోజుకు మూడు జిల్లాల ప్రతినిధులతో భేటీ అయి చర్చిస్తారు. అనంతరం మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 30 రోజులు అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇవ్వనున్నారు.