రాజకీయాల్లో ప్రచారమే చాలా కీలకంమని, దానికి అనుగుణంగా పనిచేయించడానికి పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా...
నాయకులు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో ప్రచారమే చాలా కీలకంమని, దానికి అనుగుణంగా పనిచేయించడానికి పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ‘రీచ్ అవుట్’ పేరుతో గాంధీభవన్‌లో సోమవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఏఐసీసీ ప్రతినిధిగా శ్రీనివాసన్ దీనికి హాజరై, రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండాలి... ప్రజలను ప్రభావితం చేసి పార్టీ వైపు ఆకర్షించడానికి అనుసరించాల్సిన వ్యూహం... వర్తమాన మీడియా, సోషల్ మీడియా ప్రభావం వంటివాటిని వివరించారు. కార్యక్రమంలో శాసన సభ, మండలిలో ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను అన్ని వర్గాల ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, పాలనలో వ్యవహరిస్తున్న తీరుపై అవగాహన కల్పించడానికి ప్రాంతీయ భాషల్లో, అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాలన్నారు. భట్టివిక్రమార్క కూడా నేతలకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ మంత్రులు డి.కె.అరుణ, సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.