
అందరికీ ఒకే పరిహారం ఇవ్వాలి
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మల్లన్నసాగర్ నిర్వాసితులతో పాటు అన్ని ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే వారికి 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందజేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని చోట్లా ఒకే రకమైన పరిహారం ఇవ్వాలన్నారు. ఆదివారం ఉత్తమ్ సమక్షంలో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే నిర్వాసితులను రకరకాల ప్రకటనలతో అయోమయానికి గురిచేస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు.
జీవో 123 ద్వారానే అధిక పరిహారం లభిస్తోందని చేసే ప్రచారంలో వాస్తవం లేదని, రైతులను మోసం చేయడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బహిరంగ మార్కెట్ ధరకు నాలుగింతలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పులిచింతల విషయంలో తనపై టీఆర్‌ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు కట్టకముందు ఎలాంటి జీవన ప్రమాణాలున్నాయో... ఆ తర్వాత అంతకు రెట్టింపు స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేశామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నేతలకు కాంట్రాక్టర్ల మీద ఉన్న ఉదార వాదం.. భూ నిర్వాసితుల మీద కూడా ఉండాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పులిచింతల వెంకటరెడ్డి, మర్రి రవీందర్‌రెడ్డి, గొట్టిముక్కుల రాజు తదితరులున్నారు.