జనవరి 16 భలే మంచి రోజు
సప్తమి పూట మంచిదని...
16నే ముహూర్తం బాగుంది
ఆ రోజే మంచి తిథి.. నక్షత్రం
నామినేషన్లకు సిద్ధమవుతున్న అభ్యర్థులు
తొలి రోజు 14 దాఖలు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలిరోజైన మంగళవారం కేవలం 14 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. టికెట్లు ఖరారు కాకపోవడం.. అన్ని పార్టీలూ బలమైన అభ్యర్థుల కోసం భూతద్దం వేసి వెతుకుతుండటం.. మిత్రపక్షాలతో పొత్తులు తేలకపోవడం.. వార్డుల రిజర్వేషన్లలో కొందరి అంచనాలు తలకిందులవడం... పొరుగు వార్డుల్లో ఏది ఎంచుకోవాలో తేలకపోవడం.. వంటివి నామినేషన్ల జాప్యానికి ఓ కారణం. సరైన ముహూర్తం లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో అందరూ ముందుగా ముహూర్త ‘బలం’ చూసుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు నామినేషన్లకు గడువు. దీనిలో ఒక రోజు గడిచిపోయింది. 14, 15 తేదీల్లో సంక్రాంతి సందర్భంగా నామినేషన్లు స్వీకరించరు. మిగిలింది 13, 16, 17 తేదీలు. వీటిలో ఏ రోజైతే బాగుంటుందోనని కొందరు అభ్యర్థులు జ్యోతిష్యులను, సంఖ్యా శాస్త్ర నిపుణులను సంప్రదిస్తున్నారు. వారు చెబుతున్న దాన్ని బట్టి 16వ తేదీ మాత్రమే అత్యద్భుతంగా ఉంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చూసినా 16వ తేదీ శనివారమే మంచి రోజని చెబుతున్నారు. 13న చవితి కావడంతో హిందూ క్యాలెండర్ ప్రకారం మంచిరోజు కాదు. 14 పంచమి మంచిరోజైనప్పటికీసెలవు వల్ల నామి నేషన్ వేయలేని పరిస్థితి. 15 సెలవుతో పాటు షష్టి కూడా మంచి తిథి కాదు. 16నసప్తమి అన్ని విధాలా బ్రహ్మాండమైన రోజని ఇటు హిందూ, అటు ఇస్లాం క్యాలెండర్ల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. 16న సప్తమి, రేవతీ నక్షత్రం కలిసి రావడంతో అన్ని విధాలా శ్రేయస్కరమని చెబుతున్నారు. దీంతో చాలామంది అభ్యర్థులు ఆ రోజే నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. 17నఅష్టమి... మంచిరోజు కాదని...16నే నామినేషన్లకు చాలామంది మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
ఈలోగా బలమైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు పూర్తి చేయవచ్చునని వివిధ పార్టీల అగ్రనేతలు భావిస్తున్నారు. మహిళల రిజర్వేషన్ కారణంగా అవకాశం కోల్పోయిన కొందరు ఆశావహులు తమ కుటుంబానికే టికెట్ కేటాయించాలని అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొందరు తమకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బోరుమంటున్నారు. అవివాహితులు పెళ్లి చేసుకొని తమ అర్ధాంగికి టిక్కెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇలా వివిధ కారణాలతో దాదాపు 90 శాతం మంది అభ్యర్థులు 16నే నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016వ సంవత్సరం ఎన్నికలకు 16వ తేదీ నామినేషన్ మంచి జ్ఞాపకంగా ఉంటుందని భావిస్తున్నవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు నామినేషన్ కేంద్రాలు కిటకిటలాడనున్నాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 1310 మంది పోటీ చేశారు. ఈ సంఖ్య ఈసారి మరింత పెరిగే అవకాశం ఉంది.
శనివారమే మంచి రోజు
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నెలవంక దర్శనంతో నెల ప్రారంభమవుతుంది. క్యాలెండర్ ప్రకారం రబ్బీసాని నెల మంగళవారం (జనవరి 12వ తేదీ) ప్రారంభమైంది. ప్రతి రోజూ మంచి రోజే. ఇస్లాం మతంలో బేసి సంఖ్యకు ప్రాధాన్యం ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల గడువును బట్టి... ర బ్బీసాని నెల 3వ తేదీ గురువారం (జనవరి 14) బలమైన ముహూర్తం. ఆ రోజు సెలవు కావడంతో రబ్బీసాని 5వ తేదీ శనివారం (జనవరి 16) నామినేషన్‌కు ముహూర్తం పెట్టుకోవచ్చు.
- అబుల్ ఫతే సయ్యద్ బందగి బాషా ఖాద్రీ,జాయింట్ సెక్రటరీ,
ఆల్ ఇండియా కుల్ హింద్ జమైతుల్ మాషాయిక్, హైదరాబాద్
16న శుభ ముహూర్తం
ఉత్తరాయణ పుణ్యకాలం 15వ తేదీ సాయంత్రం ప్రారంభమ వుతుంది. 16వ తేదీ సప్తమి, 17న అష్టమి. 17వ తేదీ కంటే 16న ముహూర్తబలం ఉంది. అందుకే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. వీలుపడని వారు 17న అష్టమి రోజు కూడా వేసుకోవచ్చు.
- విఠల్ శర్మ