రాజధాని... నేరాల గని
సాక్షి, సిటీబ్యూరో :
వరుస దారుణాలతో రాజధాని నగరం హడలెత్తుతోంది. నిత్యం ఏదో ఒక చోట హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు, కిడ్నాప్‌లు, చైన్‌స్నాచింగ్‌లు చోటు చేసుకుంటుండడంతో నగరజీవికి కంటి మీద కునుకు కరువవుతోంది. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే క్షేమంగా ఇంటికి చేరతామా.. అన్న సంశయం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి తోడు సైబర్‌నేరాలు, బాలికలపై లైంగిక దాడులు, హత్యలు పోలీసులకే సవాలుగా నిలుస్తున్నాయి. ఆర్థిక నేరగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకుంటున్న అభాగ్య జీవుల పరిస్థితి వర్ణనాతీతం.
ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా నగర పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమౌతున్నారు. చాలీచాలని సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు ఏమూలకూ సరిపోవడం లేదు. ఠాణాలు, సౌకర్యాల లేమి కూడా వారి పాలిట శాపంగా మారుతోంది. శాంతిభద్రతల తీరుపై జనాభా పెదవి విరుస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో దీనిపైనే ప్రధాన పార్టీల అభ్యర్థులను నిలదీయనున్నారు.
జనాభాకు అనుగుణంగా లేని పోలీసులు
హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీపడి మరీ అభివృద్ధి చెందింది. హైటెక్ హంగులతో మహానగరంగా ఎదిగింది. జనాభా కోటికి చేరువలో ఉంది. నేరాలూ అదే స్థాయిలో పెరిగాయి. కానీ శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. దేశ స్వాతంత్య్ర సమయం నాటి సిబ్బందైనా ప్రస్తుతానికి లేకపోవడం దారుణం. ఫలితంగా నేరాలు, ఘోరాలను కట్టడి చేయాల్సిన పోలీసు సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం పనిభారమంతా ఉన్న సిబ్బందిపైనే పడడంతో బాధితులకు సరైన సమయంలో న్యాయం చేయలేక సతమతమవుతున్నారు.
ఫలితంగా సిబ్బంది, అధికారులు అనారోగ్యాలకు గురౌతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణకే ఉన్న పోలీసు సిబ్బంది సరిపోవటం లేదంటే.. రాజకీయ పార్టీల కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలకూ వీరినే వినియోగించాల్సి వస్తోంది. వీటన్నిటినీ పకడ్బందీగా ఎదుర్కోవాలంటే నగరంలో ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఏ కోశానా సరిపోదు. సిటీలో ప్రస్తుతం 8698 మంది పోలీసులే ఉన్నారు. అంటే సుమారు 900 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు.
కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగుళూరు పట్టణాల్లో సుమారు 500 నుంచి 600 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. 1947 జనాభాకు అనుగుణంగా కమిషనర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వివిధ పోస్టులకు కేటాయించిన సిబ్బంది సంఖ్య 12,401 ఉండగా.. 8698 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఇంకా ఖాళీగా ఉన్న 3703 పోస్టులను నేటికీ కూడా భర్తీ చేయలేదు. ఈ పోస్టుల భర్తీతో పాటు పెరిగిన జనాభాకు అనుగుణంగా పోలీసు సిబ్బంది సంఖ్య ఇంకా సుమారు 12 వేలు పెరగాల్సి ఉంది. అంటే ఇతర పట్టణాలతో పోలిస్తే ప్రస్తుత జనాభాకు నగర పోలీసు సిబ్బంది సంఖ్య సుమారు 24 వేల మంది ఉండాలి. ఈ లెక్కన పరిశీలిస్తే ఇంకా 65 శాతం సిబ్బందిని పెంచాలి. అప్పుడే సిటీలో నేరాలను అదుపు చేయడం, బందోబస్తును చక్కగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా బాధితులకు సకాలంలో సరైన న్యాయం అందించవచ్చు.
మహిళా పోలీసుల సంఖ్య మరీ దారుణం
జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య లేదు. ప్రస్తుతం నగరంలో 511 మంది మహిళా పోలీసు సిబ్బంది (సీఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు) ఉండాలి. అయితే కేవలం 273 మాత్రమే ఉన్నారు. ఇంకా 238 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇదంతా 1947 జనాభా లెక్కల ప్రకారం. ఇక పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మహిళా సిబ్బంది పోస్టుల సంఖ్య సుమారు 1300కి పెంచాల్సి ఉంది.