నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు కేంద్ర నిధులు
♦ రహదారుల అభివృద్ధి కోసం రూ.1200 కోట్లు విడుదల
♦ నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది. మావోయి స్టు ప్రభావిత జిల్లాల్లోని మారుమూల ప్రాం తాల్లో రోడ్ల విస్తరణకు రూ.1290 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం సమాచారం అందింది. కేంద్ర నిధుల ద్వారా సుమారు 1000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర నిధుల ద్వారా నిర్మించాలని యోచిస్తోంది.
అంతర్గత భద్రతపై కేంద్రం దృష్టి
దేశ అంతర్గత భద్రతపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ సారించింది. ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ఉద్యమ జాడలున్న ప్రాంతాల్లో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను నివేదికలు కోరింది. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇటీవల ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ఉద్యమ జాడలు ఉన్నాయని నివేదికలు అందించాయి.
కొన్ని చోట్ల కొత్తగా రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో వాటిని నిలువరించేందుకు భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అటవీ ప్రాంతాల సమీపంలో ఉండే గ్రామాలను దగ్గర్లోని పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో సుమారు 1,800 కిలోమీటర్ల రోడ్ల విస్తరణకు రూ.2,700 కోట్ల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి పంపింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూ.1290 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో దాదాపు రూ.250 కోట్ల ను బ్రిడ్జీలు, కల్వర్టుల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.