సదుస్సులో మాట్లాడుతున్న మౌలానా ఖాలిద్ సైఫుల్లా. చిత్రంలో రిజ్వాన్ సాహేబ్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ చట్టంతో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి, తఫీమే షరియత్ కమిటీ కన్వీనర్ మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మనీ పేర్కొన్నారు.
ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయ ఎన్‌టీఆర్ ఆడిటోరియంలో తంజీమే షరియత్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాద విద్యార్థులు, న్యాయవాదుల సదస్సు జరిగింది. సదస్సుకు హాజరైన మౌలానా మాట్లాడుతూ.. తలాక్‌కు సంబంధించి భర్తకు మూడేళ్ల జైలు విధించేలా కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తే అతని భార్య, పిల్లల జీవనోపాధి ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.
ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రం ఇలాంటి చట్టం తీసుకురావడం అంటే షరియత్‌లో జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఈ బిల్లులో ఎన్నో లోపాలున్నాయన్నారు. ముస్లిం మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి సానుభూతి ఉంటే ముందుగా ముస్లిం మత గురువులను సంప్రదించి ట్రిపుల్ తలాక్ నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ శాతం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నవారు ఉన్నారని, దీంతో ముస్లిం షరియత్ ను మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సదస్సులో కమిటీ కో ఆర్డినేటర్ అహ్మద్‌ఖాన్, కన్వీనర్ జలీసా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment