ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో సోమవారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ జరిగింది.
బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో సోమవారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజేఆర్‌నగర్ బస్తీలో నివసించే యాదమ్మ సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేస్తుండగా మంకీ క్యాప్ ధరించి నడుచుకుంటూ వచ్చిన యువకుడు ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల మంగళసూత్రం తస్కరించి పరారయ్యాడు.
ఆమె దొంగ దొంగ అంటూ అరుస్తుండగా అక్కడే అద్దెకుంటున్న యువకులు లేచి దొంగ కోసం వెంటపడగా గల్లీలోంచి తప్పించుకొని పారిపోయాడు. ఉదయమే ఇంటి పనులు చేసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న యాదమ్మ తెల్లవారుజామునే ముగ్గు వేస్తుండగా కనిపెట్టిన ఆగంతకుడు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రైం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.