
‘చంద్రబాబు మోసం చేస్తున్నారు’
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ’ చంద్రబాబు ఏపీలో వృద్ధిరేటు పెరిగిందంటున్నారు. అవన్నీ కాకిలెక్కలే, తప్పుడు గణాకాల వల్ల రాష్ట్రం వెనుకబడిపోతుంది.
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మేము అన్ని ఆధారాలతోనే వృద్ధిరేటు గణాంకాలు బయటపెట్టాం. మేం చెప్పింది అవాస్తవమని చెప్పగలరా?. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఏవిధంగా మోసగిస్తుందో ఈ కాకిలెక్కలే నిదర్శనం. యనమల ఎందుకిలా ప్రజలను మోసగిస్తారు?.
సామాన్యుడి జీవితం అతలాకుతలం అవుతుంది. వృద్ధిరేటుపై మా దగ్గరున్న గణాంకాలన్నీ మీకు పంపిస్తాం. ఉన్నవి మూతపడుతుంటే...కొత్త పరిశ్రమలు వచ్చాయనడం సమంజసమా?. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కనీసం ఒక్క పెట్టుబడి అయినా వచ్చిందా?’ అని సూటిగా ప్రశ్నించారు.