
జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న బాబు
* మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన
* ఏబీకేను ఉన్మాది అనడం చంద్రబాబు దురహంకారం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏ పథకాన్ని అమలు చేయకపోయినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పవిత్ర పుష్కరాలను కూడా జగన్‌ను దూషించడానికి చంద్రబాబు వాడుకోవడం శోచనీయమన్నారు.
అమరావతిలో ప్రభుత్వం చేస్తున్న ఆగడాలపై బాధ్యత గలిగిన వ్యక్తిగా ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్ సుప్రీంకోర్టుకు వెళితే ఆయన్ను ఉన్మాది అని, ఆయన వెనుక జగన్ కూడా ఉన్నారని విమర్శలు చేయడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. తెలుగునాట ఉన్న ప్రముఖ పత్రికలన్నింటికీ ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించిన ఏబీకేనుద్దేశించి ఇలా వ్యాఖ్యానించిన చంద్రబాబు కన్నా దురహంకారి మరెవ్వరూ ఉండరని దుయ్యబట్టారు. మతి స్థిమితం ఉన్నవారెవ్వరూ ఇలా మాట్లాడరని, చంద్రబాబు మానసిక పరిస్థితి చాలా దిగజారినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
కోర్టులకు కాక రౌడీల వద్దకు వెళ్లాలా?: అమరావతి రైతులకు జరిగిన అన్యాయాలపై అసెంబ్లీలో మాట్లాడబోతే ప్రతిపక్షం గొంతు నొక్కారనీ, ప్రజా ఉద్యమాలు చేయబోతే లాఠీలతో కొట్టించారనీ ఇక న్యాయం కోసం కోర్టులకు కాక రౌడీలు, గూండాల వద్దకు వెళ్లాలా? అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేస్తూంటే బాధితుల తరపున న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్పవుతుందా? అని ప్రశ్నించారు. బాబు అన్నట్లుగా ఏబీకేకు సుప్రీం అక్షింతలు వేయలేదని... మీరు బాధితులు కారు కనుక బాధితులైన రైతులు ఎవరైనా సుప్రీంకోర్టుకు వస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పిందని పేర్కొన్నారు.