‘రోజుకు రూ.10లక్షలు ఎలా చెల్లిస్తున్నారు’
హైదరాబాద్: ఓట్లకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది కొత్త భాష్యం చెప్పారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకుంటే అది అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఎమ్మెల్యేలను కొనడం తప్పుకాదన్నట్లు సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించటం వింతగా ఉందన్నారు. దీనిద్వారా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని బొత్స సూటిగా ప్రశ్నించారు.
‘రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బు నాది కాదు... ఆ వాయిస్ నాది కాదు అని’ చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదన్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు చెప్పేది ఇదేనా, ఎమ్మెల్యేల కొనుగోలును ఆయన ప్రోత్సాహిస్తారా అంటూ బొత్స తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన ఆస్తి రూ.50 లక్షలని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, మరి లాయర్ లూథ్రాకు రోజుకు రూ.10 లక్షలు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. రూ.500, 1000 నోట్లను రద్దు చేయాలని నేనే చెప్పానంటున్న చంద్రబాబు అవే పెద్దనోట్లను తన అనుచరులకు ఇచ్చి లంచంగా పంపిస్తారని ధ్వజమెత్తారు.