గ్రూప్–2 పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తు ఫారంలో తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంది.
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పోస్టుల భర్తీకి గత నవంబరు 11, 13 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తాము దరఖాస్తు చేసిన ఫారంలోని బయోడేటా వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నా, వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో (ఓటీఆర్) పొరపాట్లు ఉన్నా సవరించుకునే అవకాశాన్ని టీఎస్‌పీఎస్సీ కల్పించింది. అభ్యర్థులు ఈనెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సవరించుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అదర్‌సిన్హా తెలిపారు.
అభ్యర్థుల పేరు, తండ్రి పేరు, వికలాంగుల కేటగిరీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ, డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్టులు, న్యాయ విద్య అర్హతల్లో తేడాలు ఉంటే మార్పులు చేసుకోవచ్చని, సెల్ ఫోన్ నంబర్లు, అడ్రస్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ వరకే ఈ అవకాశం ఇస్తున్నామని, ఆ తరువాత గడువు పొడగించేది లేదని స్పష్టం చేశారు.