- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం
- దీర్ఘకాలిక రోగాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ
- నేడు ఖమ్మంలో కీమోథెరపి కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మాతా శిశు సంరక్షణకు, అంటువ్యాధుల నుంచి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం గ్రామాల్లో ఏఎన్‌ఎంలు పనిచేస్తుండగా.. ఇకనుంచి మరో ఏఎన్‌ఎంను గ్రామాల్లోకి పంపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అదనంగా నియమించే ప్రత్యేక ఏఎన్‌ఎంలు కేవలం బీపీ, షుగర్‌లను మాత్రమే చెక్ చేస్తారు. వారికి ఇతరత్రా బాధ్యతలు ఏవీ అప్పగించారు. ఎవరెవరికి బీపీ, షుగర్‌లు ఉన్నాయో రికార్డు చేసి ఆయా రోగులను అప్రమత్తం చేస్తారు. తద్వారా దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో వీరు పనిచేస్తారు. వారికి బీపీ, షుగర్ పరీక్షించేందుకు అవసరమైన పరికరాల కిట్‌ను అందజేస్తారు. వారు ఇంటింటికీ వెళ్లి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్య ఉప కేంద్రానికి తీసుకెళ్తారు. నిత్యం ఏఎన్‌ఎంలు ఇదే పనిలో నిమగ్నమవుతారు.
నిర్ధారణ.. నియంత్రణ.. నిర్మూలన
దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించి వాటిని శస్త్రచికిత్సల ద్వారా నిర్మూలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ప్రత్యేక టవర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నిమ్స్‌లో కిడ్నీ సెంటర్‌ను, లివర్ టవర్‌ను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిలో భాగంగా ముందుగా ఖమ్మంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన కీమోథెరపి యూనిట్‌ను ప్రారంభిస్తారు.
బీపీ చెకింగ్‌కు ప్రత్యేక ఏఎన్‌ఎంలు
Published Thu, Jun 30 2016 4:20 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement