ఆస్పత్రిని సందర్శించే తీరిక లేదా?
సీఎం కేసీఆర్ తీరుపై చెరుకు సుధాకర్ విమర్శ
హైదరాబాద్: పెట్టుబడిదారుల ఇళ్లకు వెళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతల ప్రాణాలు పోతే కనీసం సందర్శించకపోవడం దారుణమని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ విమర్శించారు. హైదరాబాద్ సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం ఆయన సందర్శించి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజను బాలింతల మరణాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌తో పాటు వెంటిలేటర్లు ఏర్పాటు చేసి బాలింతల ప్రాణాలు పోకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య వ్యవస్థలో లోపం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది గద్దల్లా పేదలను పీక్కుతింటున్నారని ఆయన అన్నారు. వైద్య మంత్రిని మార్చినా అవినీతి ఆగలేదని.. ఆసుపత్రుల అభివృద్ధి జరగలేదని అన్నారు. టీఎస్‌ఐఎండీసీ 90 శాతం నాసిరకం మందులు కొనుగోలు చేస్తుందని, ఇలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.