
సాగునీటి ప్రాజెక్టుల్లో చైనా కంపెనీ పెట్టుబడి
♦ రూ.10 వేల కోట్ల పెట్టుబడికి గెజొభా కంపెనీ ఆసక్తి
♦ సీఎం కేసీఆర్‌తో కంపెనీ ప్రతినిధుల భేటీ
♦ చైనా సంస్థల సాయం తీసుకుంటామని సీఎం ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ చైనా గెజొభా గ్రూపు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో శనివారం క్యాంపు కార్యాలయంలో రెండో రోజు చర్చలు జరిపిన సంస్థ ప్రతినిధుల బృందం ఈ మేరకు ఆసక్తి ప్రదర్శించిందని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గెజొభా సంస్థ తరఫున ముఖ్య ప్రతినిధి హుయాంగ్ వాన్లిన్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ లూ వీమింగ్, భారత ప్రతినిధులు జీహెచ్ సంపత్ కుమార్, జి.వెంకటాచలం తదితరులు సీఎంతో భేటీ అయ్యారు.
నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సాగునీటి రంగ నిపుణుడు పెంటారెడ్డి, ఇఎన్సీ మురళీధర్, సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా సంస్థల ఆర్థిక, సాంకేతిక సహకారం తీసుకుంటామని ప్రకటించారు. చైనాలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను, అక్కడ ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంభిస్తున్న పద్ధతులను అధ్యయం చేయడానికి ఇంజనీరింగ్ నిపుణులను ఆ దేశానికి పంపాలని సీఎం నిర్ణయించారు.
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుల విషయంలో విశేష అనుభవం ఉన్న చైనా కంపెనీలు తెలంగాణలో కూడా పనిచేయడం ఎంతో ఉపయుక్తమన్నారు. కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, ఇతర ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొనాలని చైనా కంపెనీని ఆహ్వానించారు. కాగా, రాష్ట్ర ఇంజనీర్ల బృందం చైనాలో పర్యటించి వచ్చిన తర్వాత తదుపరి విషయాలపై అవగాహనకు రావాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం, నాణ్యత విషయంలో చైనా కంపెనీలు మెరుగైన పనివిధానం కలిగి ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో లక్ష్యాలు నిర్ణయించుకుని నీటిపారుదల శాఖ పనిచేయాలని సీఎం చెప్పారు. బ్యారేజీల నిర్మాణంతో సంబంధం లేకుండా...పంపు హౌజులు, పైపులైన్లు, కాల్వలు, లిఫ్టుల పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 2017 చివరి నాటికి కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లికి, మల్లన్న సాగర్‌కు నీరందించాలన్నారు.