
మహిళలు తలుచుకుంటే పట్టణాలన్నీ హరితమయం
హరితహారంపై శిక్షణలో మంత్రి కేటీఆర్
72 పట్టణాల్లో 64 లక్షల మొక్కలు నాటాలి
గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 25 లక్షల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: మహిళలంతా తలుచుకుంటే పట్టణాలన్నీ హరితమయంగా మారిపోతాయని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సోమవారం పురపాలకశాఖ కమిషనరేట్ (సీడీఎంఏ)లో పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు హరితహారంపై శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రతి మహిళా సంఘం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలు ఇప్పటికే ఎన్నో స్ఫూర్తిదాయక విజయాలు అందుకున్నాయని, హరితహారం ద్వారా మరోసారి చరిత్రను పునరావృతం చేయాలన్నారు. సొంత పిల్లల మాదిరిగా మొక్కలను పెంచాలన్నారు. ఈ ఏడాది 72 పట్టణాల్లో 64 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 25 లక్షల మొక్కలు నాటనున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 806 ఎకరాల భూమిని గుర్తించామన్నారు.
మారిన వాతావరణ పరిస్థితుల్లో మొక్కల పెంపకం అత్యవసరమైందన్నారు. చెట్లు లేక లోకల్ వార్మింగ్ వల్ల జరుగుతున్న దుష్ఫలితాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండే ఉంటుందన్నారు. హరితహారంతో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటుతామన్నారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హరితహారం విజయవంతమవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహాయజ్ఞంలో పురపాలకశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందన్నారు. మొక్కలను నాటి, పెంచే పట్టణాలకు రూ. 5 కోట్లకుపైగా ప్రోత్సహకాలు ప్రకటిస్తామన్నారు.
పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఆస్తులను కాపాడేందుకు మొక్కలను పెంచడమే చక్కని పరిష్కారమన్నారు. జియో ఫెన్సింగ్‌తోపాటు గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు పురపాలకశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సంచాలకులు దానకిశోర్‌ను ఆదేశించారు. రాష్ట్రంలోని 13 పురపాలికలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మార్చి 100% మరుగుదొడ్లు నిర్మించడంలో సహకరించిన మహిళ సంఘాల నేతలను కేటీఆర్ సన్మానించారు.