ట్రాఫిక్ వలయంలో సిటీ బస్సు..
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్‌కు బయలుదేరింది. అప్పటికి అరగంట గడిచింది. బస్సు ఇంకా ప్యారడైజ్ దాటి ముందుకు వెళ్లలేదు. పదకొండోసారి ఫోన్ చూసుకున్నాడు శ్రీకాంత్. ఠంచన్‌గా 9 గంటలకు ఆఫీసులో ఉండాలి. కానీ పుణ్యకాలం కాస్తా సికింద్రాబాద్‌లోనే గడిచిపోతోంది. గడియారంలో పరుగులు తీస్తున్న నిమిషాల ముల్లు చూసుకొని బెంబేలెత్తాడు. మరో ఆలోచనకు తావు లేకుండా బస్సులోంచి కిందకు దూకి నంత పని చేశాడు.
కనిపించిన ఆటో ఎక్కేసి ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. రూ.750 చెల్లించి నెలవారీ బస్‌పాస్ తీసుకున్నప్పటికీ తరచుగా బస్సుల జాప్యం కారణంగా తనకు ఆటో చార్జీలు తప్పడం లేదు. ఇది హైటెక్ సిటీ లోని ఓ కంపెనీలో పనిచేసే శ్రీకాంత్ ఒక్కరి సమస్యే కాదు. సిటీ బస్సును నమ్ముకొని ఉదయం ఆఫీసులకు, సాయంత్రం ఇళ్లకు ప్రయాణాలు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రయాణికులంతా ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇటీవల బస్సుల వేగం దారుణంగా పడిపోతోంది. గంట గడిచినా పట్టుమని 10 కిలోమీటర్లు కూడా ప్రయాణం ముందుకు సాగడం లేదు. రోజురోజుకూ జటిలమవుతున్న వాహనాల రద్దీ, కుంచించుకుపోతున్న రోడ్లు, డొక్కు బస్సులు, బ్రేక్‌డౌన్‌లు సిటీ ప్రయాణాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. నగర శివార్లలో సైతం పోటెత్తుతున్న ట్రాఫిక్‌తో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా సమయం బస్సులోనే గడిచిపోతోంది.
నత్తలు నయం...
ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట్ వంటి ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మూడు నిమిషాలకు కిలోమీటర్ చొప్పున... వాహనాల రద్దీ తక్కువగా ఉన్న శివారు రహదారులపైన రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున ఆర్డినరీ బస్సులకు రన్నింగ్ టైమ్ విధించారు. ఈ లెక్కన గంటకు కనీసం 20 కిలోమీటర్ల వరకు వెళ్లాలి. కానీ ఈ బస్సులు గంటకు 10 కి.మీ. కూడా ముందుకు కదలడం లేదు. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌లు, ఏసీ బస్సులు రద్దీ ప్రాంతాల్లో రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున, శివార్లలో 2 నిమిషాలకు కిలోమీటర్ చొప్పున వెళ్లాలి
అంటే 45 నిమిషాల్లో సుమారు 20 కి.మీ. వెళ్లాల్సిన మెట్రో బస్సులు సైతం ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపైనే చిక్కుకొని పోతున్నాయి. 28 కి.మీ. ఉన్న సికింద్రాబాద్-కొండాపూర్ మార్గంలో ఆర్డినరీ బస్సులు గంటా 10 నిమిషాల్లో గమ్యం చేరుకోవలసి ఉండగా రెండు గంటలు దాటుతోంది. మెట్రో, ఏసీ బస్సులు కూడా అదే సమయానికి చేరుకుంటున్నాయి. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కారణంగా బస్సులు రోడ్లపై నిలిచిపోయి అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మెట్రో పనులు జరగుతున్న మార్గాల్లో ఈ పరిస్థితి మరింత భయానకంగా మారింది.
రోడ్లపైనే నిల్చిపోతున్న పలు బస్సులు
ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా వందలాది బస్సుల్లో విడిభాగాలు దెబ్బతిన్నాయి. ఈ బస్సులు సకాలం లో మరమ్మతులకు నోచుకోపోవడం వల్ల ఎక్కడికక్కడ నిలి చిపోతున్నాయి. పదిరోజుల క్రితం దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఒక బస్సుకు నాగోల్ వద్ద రాడ్ ఊడిపోయింది. డ్రైవ ర్ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని బస్సులకు రియర్‌వ్యూలు కూడా ఉండడం లేదు. రాత్రి పూట హెడ్‌లైట్లు వెలగని బస్సులు కూడా ఉన్నాయని డ్రైవర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడిభాగాల కొరత వల్ల వివిధ డిపోల పరిధిలో బ్రేక్‌డౌన్‌లు బాగా పెరిగాయి. రోజూ 15 నుంచి 20 బస్సులు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి.
తగ్గిన ప్రయాణికులు
సకాలంలో గమ్యానికి చేర్చలేని సిటీ బస్సులకు ప్రయాణికులు దూరమవుతున్నారు. ఆటోరిక్షా లు, సెవెన్‌సీటర్ ఆటోలు, కార్లు వంటి ప్రత్యామ్నాయ వాహనాలవైపు మళ్లుతున్నారు. బస్సు ల నిర్వహణలోని వైఫల్యం కారణంగా ఇటీవల ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు అంచనా. లక్షలాదిమంది ప్రయాణికులు ఆర్టీసీకి దూరమయ్యారు.