auto charges
-
దయాగుణ సంపన్నుడు
పేదింటి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆకలితో ఉన్నారు. ‘పిల్లలు ఆకలితో ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. సహాయం చేయండి’ అని ఆశిష్ అనే యువకుడిని అడిగారు ఆ దంపతులు. పదో పరకో వారి చేతిలో పెట్టి తన దారిని తాను వెళ్లిపోలేదు ఆశిష్. దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి వారు కోరిన పదార్థాలు తినిపించాడు. ఆ తరువాత వారిని ఆటో ఎక్కించి డ్రైవర్‌కు తానే డబ్బులు ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ఆకలి తీర్చడం మాత్రమే కాదు మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు అని ధైర్యం చెప్పడం కూడా’ అని రాశాడు ఆశిష్. ‘దయాగుణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే వినికిడి శక్తి లేని వారు కూడా వినగలరు. కంటిచూపు లేని వారు కూడా చూడగలరు. దయాగుణాన్ని మించిన సంపద లేదు’ అని ఒక యూజర్ రాశాడు. -
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్! ఆ రెండు రోజులు ఆటోలు బంద్
సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్: ఆటో చార్జీలు పెంచాలని కోరుతూ పలు ఆటో సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లను ఆదుకొనేందుకు చార్జీలు పెంచాలని, కొత్తగా మరో 20 వేల పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్, క్యాబ్ యూనియన్స్ జేఏసీ నేతలు బి.వెంకటేశం, సత్తిరెడ్డి, మల్లేష్ గౌడ్, మారయ్య, అమానుల్లాఖాన్ తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో భవిష్యత్ కార్యాచరణపై ఆటో, క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. నగరంలో 8 ఏళ్లుగా చార్జీలు పెంచకపోవడంతో ఆటోడ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కరోనా, లాక్డౌన్ కారణంగా క్యాబ్, ఆటోలకు డిమాండ్ తగ్గిపోయిందని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆటో మీటర్ చార్జీలు కనీసం రూ.40.., కిలో మీటర్‌కు రూ. 25 చొప్పున పెంచాలని కోరారు. సీఎన్జీతో నడిచే 20 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్య పించన్లు, ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం, వారి పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఏపీలో ఇస్తున్నట్లుగా ప్రతి ఆటో డ్రైవరుకూ రూ.10 వేలు ఇవ్వాలని అన్నారు. ఇతర జిల్లాల్లోని ఆటోలు హైదరాబాద్ నగరంలో తిరగకుండా నిషేధం విధించాలన్నారు. (చదవండి: కీసరగుట్టలో అడవుల్లో కార్చిచ్చు) -
సికింద్రాబాద్ టు హైటెక్ సిటీ.. ఆటో చార్జీ రూ.1000
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన వెంకటరమణ విజయవాడ నుంచి రైలులో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. హైటెక్ సిటీకి వెళ్లేందుకు ఓ ఆటోను ఆశ్రయించారు. ఆటోవాలా ఏకంగా రూ.1000 డిమాండ్ చేశాడు. వెంకటరమణకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. సాధారణ రోజుల్లో అయితే రూ.350 కంటే ఎక్కువ ఉండదు. కానీ కోవిడ్ కాలం. పైగా మరి కొద్దిసేపట్లో లాక్డౌన్ ఆంక్షలు మొదలవుతాయి. వెంకటరమణ గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ అడిగిన రూ.1000 ఇవ్వాల్సివచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఉదయం 10 గంటల్లోపు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లాలన్నా, ఇతర ఊళ్లకు పోవాలన్నా లేదా ఇతర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, విమానాల్లో నగరానికి చేరుకున్నవాళ్లు గమ్యస్థానాలకు వెళ్లాలన్నా వందల్లో చార్జీలు సమర్పించుకోవాల్సి వస్తోంది. అడ్డూ అదుపూ లేని ఆటోల దోపిడీ.. ► లాక్డౌన్ దృష్ట్యా నగరంలో బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. సికింద్రాబాద్ నుంచి బీహెచ్ఈఎల్, దిల్సుఖ్నగర్ నుంచి పటాన్చెరు, ఉప్పల్ నుంచి మెహిదీపట్నం తదితర మార్గాల్లో మాత్రమే ఉదయం 10 వరకు బస్సులు పరిమితంగా నడుస్తున్నాయి. ► నగరం నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వాళ్లు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్, నాంపల్లి, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల వద్ద తిష్ట వేసుకున్న ఆటోలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. క్యాబ్‌ల కోసం పడిగాపులు.. ► మరోవైపు సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి క్యాబ్‌లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లాక్డౌన్ విధించడంతో వీటి సంఖ్య మరింత తగ్గింది. గతంలో సుమారు 60 వేల క్యాబ్‌లు అందుబాటులో ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 10 వేల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో ప్రయాణికుల అవసరాలకు సరిపడా క్యాబ్‌లు అందుబాటులో ఉండడం లేదు. ► క్యాబ్ బుక్ చేసుకొనేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకు వేచి ఉండాల్సి వస్తోంది. చివరకు బుక్ అయినా పెద్ద మొత్తంలో చార్జీలు చెల్లించాల్సివస్తోంది. సాధారణ రోజుల్లో ఎయిర్‌పోర్టు నుంచి తిరుమలగిరికి వెళ్లేందుకు రూ.800 వరకు క్యాబ్ చార్జీలు ఉంటే ఇప్పుడు రూ.1500 వసూలు చేస్తున్నారు. జేబులో రూ.500 ఉండాల్సిందే మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి అంబర్‌పేట్‌కు ఆటోలో వచ్చేందుకు రూ.200 తీసుకున్నారు. సాధారణ రోజుల్లో రూ.50 కంటే ఎక్కువ ఉండదు. ఇది లాక్‌డౌన్‌కు ముందు ఉన్న చార్జీ. లాక్డౌన్ మొదలైన తర్వాత ఆటో ఎక్కాలంటే కనీసం రూ.500 జేబులో ఉంచుకోవాల్సిందే. సిటీ బస్సులు సరిపడా లేకపోవడం కూడా కారణమే. – ఓబులేసు, అంబర్పేట్ ఆపద సమయంలో ఇదేం దోపిడీ? కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న ఇలాంటి ఆపత్కాలంలో కూడా ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవడం చాలా దారుణం. ఏ చిన్న అవసరం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చినా సరే సకాలంలో తిరిగి ఇల్లు చేరాలంటే చార్జీల రూపంలో రూ.వందలు చెల్లించుకోవాల్సి వస్తోంది. – నీరూ ఠాకూర్, సామాజిక కార్యకర్త చదవండి: అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం -
HYD: రెట్టింపైన క్యాబ్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: పద్మారావునగర్‌కు చెందిన రోహిత్ నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ నుంచి మణికొండకు క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సాధారణ రోజుల్లో రూ.350 చార్జీ నమోదు కాగా ప్రస్తుతం రూ.550కి పెరిగింది. అత్యవసరమైన పని కావడంతో తప్పనిసరిగా బయలుదేరవలసి వచ్చింది. బంజారాహిల్స్ నుంచి రాంనగర్ వరకు ప్రతి రోజు క్యాబ్‌లో ప్రయాణం చేసే గోపీనాథ్‌కు భారీగా పెరిగిన చార్జీలతో బెంబేలెత్తాడు. లాక్‌డౌన్‌కు ముందు రోజుల్లో అయితే ఆ రూట్లో రూ.110 నుంచి రూ.120 వరకు చార్జీ అయ్యేది. కానీ ఇప్పుడు రూ.180 నుంచి రూ.220 వరకు నమోదవుతున్నాయి. ఒక్కోసారి అది రూ.250 వరకు పెరిగిపోతుంది. (హైదరాబాద్-తిరుపతి మధ్య తగ్గనున్న దూరం) ఇది ఏ ఒక్క రూట్‌కు పరిమితమైన చార్జీలు కాదు. నగరంలోని అన్ని రూట్లలోనూ కొద్ది రోజులుగా క్యాబ్ చార్జీలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు, తరువాత క్యాబ్ చార్జీల్లో గణనీయమైన తేడా నమోదవుతోంది. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ఎంఎంటీఎస్ ఇప్పటికీ పునరుద్ధరణకు నోచకపోవడంతో మెట్రోరైళ్లు అందుబాటులో లేని మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోలు, క్యాబ్‌లపైన ఆధారపడాల్సి వస్తుంది. ప్రయాణికుల అవసరాన్ని, డిమాండ్‌ను క్యాబ్ సంస్థలు ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్నాయి. అరకొర సదుపాయాలే... అన్‌లాక్ 4.0 నుంచి క్రమంగా జనజీవన సాధారణ స్థాయికి చేరుకుంది. రాకపోకలు పెరిగాయి. మొదట్లో మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అన్‌లాక్ 5.0 తరువాత పరిమితంగా సిటీ బస్సులను పునరుద్ధరించారు. సాధారణంగానే గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 30 లక్షల మంది సిటీ బస్సుల్లో తిరుగుతారు. మరో 10 లక్షల నుంచి 15 లక్షల మంది క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణం చేస్తారు. కరోనా కారణంగా ప్రయాణాలు తగ్గినప్పటికీ లాక్డౌన్ సడలింపులతో ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. ఉద్యోగ, వ్యాపారాల కోసమే కాకుండా అన్ని రకాల అవసరాల కోసం వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కానీ ఇందుకు తగినట్లుగా రవాణా సదుపాయాల పునరుద్ధరణ జరగలేదు. ఐటీ రంగం ఇంకా ప్రారంభం కాకపోవడంతో క్యాబ్‌లు తక్కువగా తిరుగుతున్నాయి. గతంలో 1.5 లక్షల క్యాబ్‌లు ఉంటే ఇప్పుడు 60 వేలకు తగ్గాయి. తిరిగి ఐటీ పుంజుకుంటే తప్ప క్యాబ్ సదుపాయం మెరుగుపడకపోవచ్చునని అంచనా. సాధారణ రోజుల్లో కనీసం 50 లక్షల మంది వివిధ రకాల ప్రజా రవాణా సదుపాయాలను వినియోగించేవారని భావించినా ఇప్పుడు అందులో సగం మందికి సరిపడా ప్రజారవాణా కూడా అందుబాటులో లేదు. 3000 బస్సులకు బదులు 1000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మరో 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఇంకా పునరుద్ధరణకు నోచలేదు. దీంతో అరకొర సదుపాయాలపైన ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తుంది. లేదంటే వ్యక్తిగత వాహనాలపైన ఆధారపడాల్సి వస్తుంది. డ్రైరన్ పేరిట హాఫ్ రిటర్న్... ఈ క్రమంలోనే క్యాబ్ సంస్థలు చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. ప్రయాణికులు కోరుకున్న చోట నుంచి క్యాబ్ అందుబాటులో లేదనే సాకుతో డ్రైరన్ పేరిట అదనపు చార్జీలు విధిస్తున్నారు. ఉప్పల్‌లో బుక్ చేసుకొనే ప్రయాణికుడికి అక్కడికి దగ్గర్లో క్యాబ్ అందుబాటులో లేదనే కారణంతో తార్నాక నుంచి రప్పిస్తారు. తార్నాక నుంచి ఉప్పల్ వరకు ఖాళీగా వచ్చినందుకు ఆ మొత్తాన్ని ప్రయాణికులపైన మోపుతున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇదే తరహాలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్లుగా క్యాబ్‌లు అందుబాటులో లేవనే కారణంతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. డ్రైరన్ పేరిట భారం మోపుతున్నారు. ఆటోల్లోనూ అదే దోపిడీ కొనసాగుతోంది. ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగుతున్నారు. కమీషన్లో మార్పు లేదు ఇదంతా క్యాబ్ సంస్థల మాయాజాలమే. డ్రైరన్ వల్ల బలయ్యేది డ్రైవర్లే. ప్రయాణికుల దగ్గర అదనంగా వసూలు చేసే చార్జీలు క్యాబ్ సంస్థలకే వెళ్తున్నాయి. మా దగ్గర మాత్రం ప్రతి రైడ్‌కు యథావిధిగా 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20 శాతానికి తగ్గిస్తే డ్రైవర్లకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ క్యాబ్ సంస్థలు ఆ పని చేయడం లేదు. – షేక్ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ -
ఆటో కన్నా విమాన చార్జీలే నయం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలే చౌకగా ఉన్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఆటో రిక్షాలో కిలోమీటర్‌కు రూ . 5 వరకూ చార్జ్ చేస్తుండగా, విమానాల్లో కిలోమీటర్‌కు రూ. 4 మాత్రమే వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. భారత ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న క్రమంలో సిన్హా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఎయిర్‌లైన్స్‌ల సమిష్టి నష్టాలు రూ 12,000 కోట్ల వరకూ ఉంటాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ వంటి సంస్ధలతో పాటు అన్ని ఎయిర్లైన్లు ఇంధన ధరల భారం, తక్కువ ప్రయాణ చార్జీలతో కుదేలవుతున్నాయి. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా టికెట్ ధరలను పెంచకపోవడం ఎయిర్‌లైన్స్ నష్టాలకు కారణమవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండిగో మినహా అన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. -
ఆటోచార్జీలు పెంచడం తప్పదు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్
హైదరాబాద్‌లో సుమారు 1.20 లక్షల ఆటోలు ఆగిపోయే అవకాశం ఇందులో 25 వేల స్కూల్ ఆటోలు గ్రేటర్ పరిధిలో 1520 లక్షల మందికి ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాలు రూ.1,000కి పెంచు తూ గత సంవత్సరం జారీ చేసిన జీవో 108ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటో బంద్‌కు పిలుపునిచ్చిం ది. 16 ఆటో సంఘాల నేతృత్వంలో ఈ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ ప్రతినిధులు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), ఎ.సత్తిరెడ్డి (ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల సమాఖ్య), నరేందర్ (ఐఎఫ్టీయూ) గురువారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆటో కనీస చార్జి రూ.16 నుంచి రూ.25 చేయాలని, ఆపైన ప్రతి కి.మీ.కి రూ.15కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) బంద్‌కు దూరంగా ఉంది. ఆర్టీసీ అదనపు బస్సులు! ఆటో సమ్మె అనివార్యమైతే 100 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్-వీఎస్టీ, రామ్‌నగర్-కోఠి, రామంతాపూర్-లక్డీకాపూల్, చార్మినార్-ఆఫ్జల్‌గంజ్, సనత్‌నగర్-లక్డీకాపూల్ వంటి రూట్లలో ఇవి అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు తెలిపారు. -
ట్రాఫిక్ వలయంలో సిటీ బస్సు..
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్‌కు బయలుదేరింది. అప్పటికి అరగంట గడిచింది. బస్సు ఇంకా ప్యారడైజ్ దాటి ముందుకు వెళ్లలేదు. పదకొండోసారి ఫోన్ చూసుకున్నాడు శ్రీకాంత్. ఠంచన్‌గా 9 గంటలకు ఆఫీసులో ఉండాలి. కానీ పుణ్యకాలం కాస్తా సికింద్రాబాద్‌లోనే గడిచిపోతోంది. గడియారంలో పరుగులు తీస్తున్న నిమిషాల ముల్లు చూసుకొని బెంబేలెత్తాడు. మరో ఆలోచనకు తావు లేకుండా బస్సులోంచి కిందకు దూకి నంత పని చేశాడు. కనిపించిన ఆటో ఎక్కేసి ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. రూ.750 చెల్లించి నెలవారీ బస్‌పాస్ తీసుకున్నప్పటికీ తరచుగా బస్సుల జాప్యం కారణంగా తనకు ఆటో చార్జీలు తప్పడం లేదు. ఇది హైటెక్ సిటీ లోని ఓ కంపెనీలో పనిచేసే శ్రీకాంత్ ఒక్కరి సమస్యే కాదు. సిటీ బస్సును నమ్ముకొని ఉదయం ఆఫీసులకు, సాయంత్రం ఇళ్లకు ప్రయాణాలు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రయాణికులంతా ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఇటీవల బస్సుల వేగం దారుణంగా పడిపోతోంది. గంట గడిచినా పట్టుమని 10 కిలోమీటర్లు కూడా ప్రయాణం ముందుకు సాగడం లేదు. రోజురోజుకూ జటిలమవుతున్న వాహనాల రద్దీ, కుంచించుకుపోతున్న రోడ్లు, డొక్కు బస్సులు, బ్రేక్డౌన్లు సిటీ ప్రయాణాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. నగర శివార్లలో సైతం పోటెత్తుతున్న ట్రాఫిక్‌తో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా సమయం బస్సులోనే గడిచిపోతోంది. నత్తలు నయం... ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట్ వంటి ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మూడు నిమిషాలకు కిలోమీటర్ చొప్పున... వాహనాల రద్దీ తక్కువగా ఉన్న శివారు రహదారులపైన రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున ఆర్డినరీ బస్సులకు రన్నింగ్ టైమ్ విధించారు. ఈ లెక్కన గంటకు కనీసం 20 కిలోమీటర్ల వరకు వెళ్లాలి. కానీ ఈ బస్సులు గంటకు 10 కి.మీ. కూడా ముందుకు కదలడం లేదు. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌లు, ఏసీ బస్సులు రద్దీ ప్రాంతాల్లో రెండున్నర నిమిషాలకు కిలోమీటర్ చొప్పున, శివార్లలో 2 నిమిషాలకు కిలోమీటర్ చొప్పున వెళ్లాలి అంటే 45 నిమిషాల్లో సుమారు 20 కి.మీ. వెళ్లాల్సిన మెట్రో బస్సులు సైతం ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపైనే చిక్కుకొని పోతున్నాయి. 28 కి.మీ. ఉన్న సికింద్రాబాద్-కొండాపూర్ మార్గంలో ఆర్డినరీ బస్సులు గంటా 10 నిమిషాల్లో గమ్యం చేరుకోవలసి ఉండగా రెండు గంటలు దాటుతోంది. మెట్రో, ఏసీ బస్సులు కూడా అదే సమయానికి చేరుకుంటున్నాయి. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కారణంగా బస్సులు రోడ్లపై నిలిచిపోయి అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మెట్రో పనులు జరగుతున్న మార్గాల్లో ఈ పరిస్థితి మరింత భయానకంగా మారింది. రోడ్లపైనే నిల్చిపోతున్న పలు బస్సులు ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా వందలాది బస్సుల్లో విడిభాగాలు దెబ్బతిన్నాయి. ఈ బస్సులు సకాలం లో మరమ్మతులకు నోచుకోపోవడం వల్ల ఎక్కడికక్కడ నిలి చిపోతున్నాయి. పదిరోజుల క్రితం దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఒక బస్సుకు నాగోల్ వద్ద రాడ్ ఊడిపోయింది. డ్రైవ ర్ అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కొన్ని బస్సులకు రియర్వ్యూలు కూడా ఉండడం లేదు. రాత్రి పూట హెడ్లైట్లు వెలగని బస్సులు కూడా ఉన్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడిభాగాల కొరత వల్ల వివిధ డిపోల పరిధిలో బ్రేక్డౌన్లు బాగా పెరిగాయి. రోజూ 15 నుంచి 20 బస్సులు రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. తగ్గిన ప్రయాణికులు సకాలంలో గమ్యానికి చేర్చలేని సిటీ బస్సులకు ప్రయాణికులు దూరమవుతున్నారు. ఆటోరిక్షా లు, సెవెన్‌సీటర్ ఆటోలు, కార్లు వంటి ప్రత్యామ్నాయ వాహనాలవైపు మళ్లుతున్నారు. బస్సు ల నిర్వహణలోని వైఫల్యం కారణంగా ఇటీవల ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు అంచనా. లక్షలాదిమంది ప్రయాణికులు ఆర్టీసీకి దూరమయ్యారు. -
అమలులోకి కొత్త ఆటో చార్జీలు
ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత చెన్నై నగరంలోని ఆటోలకు మీటర్లు తప్పనిసరి కానున్నాయి. ఆదివారం నుంచి కొత్తచార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస చార్జీగా రూ.25, తర్వాత కిలోమీటరుకు రూ.12 వంతున నిర్ణయించారు. రాత్రుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలతో అధికారులు చార్జీల జాబితా ప్రకటించారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, తిరుచ్చి, సేలం, మదురై తదితర ప్రధాన నగరాల్లో ఆటో చార్జీల మోత మోగుతోంది. చెన్నైలో చార్జీల దోపిడీకి హద్దే లేదని చెప్పవచ్చు. ఏ ఒక్క ఆటోలోనూ మీటర్ కనిపించదు. కూతవేటు దూరానికైనా ఆటోవాలా అడిగినంత చెల్లించాల్సిందే. చార్జీల దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఢిల్లీ, బెంగళూరు తరహా చెన్నైలోనూ చార్జీల్ని ప్రభుత్వమే నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు, ప్రయాణీకుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, ఆటో కార్మిక, యాజమాన్య సంఘాల ప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటైంది. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయూలు సేకరిచింది నివేదికను ముఖ్యమంత్రి జయలలితకు సమర్పించింది. ఆదేశాలు జారీ: మంత్రులు, అధికారుల బృందంతో ముఖ్యమంత్రి జయలలిత రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆటోచార్జీల్ని అమలు చేయడానికి నిర్ణయించారు. ఆదివారం నుంచే ఈ చార్జీలు అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు వెలువడ్డాయి. తరచూ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రయాణీకుల సంక్షేమం, భద్రతను పరిగణనలోకి తీసుకుని కొత్త ఆటో చార్జీల్ని నిర్ణయిం చినట్లు జయలలిత పేర్కొన్నారు. ఇదీ జాబితా = కనీస చార్జీగా రూ.25 నిర్ణయించారు. 1.8 కిలోమీటర్ల అనంతరం ప్రతి కిలోమీటర్‌కు రూ.12 చార్జీ వసూలు చేయనున్నారు. = రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మీటరుపై యాభై శాతం అదనపు చార్జీ వసూళ్లు చేసుకోవచ్చు. = ప్రతి ఐదు నిమిషాలకు వెయిటింగ్ చార్జీగా రూ.3.50 నిర్ణయించారు. గంట వెయింటిం గ్‌కు రూ.42 వసూళ్లు చేయనున్నారు. = ఆదివారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రావాలి. సెప్టెంబరు పదిహేనులోపు పూర్తిస్థాయిలో అన్ని ఆటోల్లో అమలు చేయాలి. ఆటో చార్జీల వివరాలతో కూడిన మీటర్లను ఆయా డివిజన్ల పరిధిలోని రవాణా కార్యాలయాల్లో స్వీకరించుకోవచ్చు. = దేశ చరిత్రలో ప్రప్రథమంగా ఆటోలకు జీపీఎస్ పరికరం, ఎలక్ట్రానిక్ బిల్లింగ్ యంత్రం తో కూడిన మీటర్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మీటర్ల కొనుగోలుకు రూ.80 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆటో ఎక్కడికి వెళుతోంది, ఏ ప్రదేశంలో ఉంది తదితర వివరాలను జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. మీటరకు తగ్గ చార్జీని రశీదు రూపంలో అందుకుని చెల్లించే అవకాశం ఇచ్చారు. = ఆటోలో ప్రయాణించే సమయంలో ఏదేని ప్రమాదం చోటు చేసుకున్నా, ఆటోవాల రూపంలో ఏదేని ముప్పు ఎదురైనా పోలీసుల్ని అప్రమత్తం చేసే రీతిలో ప్రత్యేక సౌకర్యం కల్పించనున్నారు. ప్యానిక్ బటన్‌ను ఆటోమీటర్ల వద్ద అమర్చనున్నారు. ఈ బటన్‌ను నొక్కిన పక్షంలో కంట్రోల్ రూమ్‌కు ఏ ఆటో నుంచి, ఏ సమయంలో, ఏ ప్రదేశం నుంచి.. అన్న వివరాలతో ప్రమాద హెచ్చరిక సమాచారం చేరుతుంది. = ఆటోచార్జీల అమలుపై పర్యవేక్షణకు పోలీసులు, రవాణాశాఖ అధికారులతో బృందాలు నియమించనున్నారు. ఆటోచార్జీలు అధికంగా వసూళ్లు చేసిన పక్షంలో సంబంధిత డ్రైవర్ లెసైన్సు, ఆటో రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్‌ను త్వరలో ప్రకటించనున్నారు. అంగీకారం: ప్రభుత్వం ప్రకటించిన చార్జీల పట్ల ఆటో సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఆటో చార్జీల ప్రకటనతో కార్మిక సంఘాలు గిండిలో ఆదివారం సమావేశమయ్యాయి. కొత్త చార్జీల్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. చార్జీల్లో ప్రతి ఏటా మార్పులు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధర పెరిగినప్పుడల్లా చార్జీల్ని పెంచాలని, ఇందు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే మీటర్లు అమర్చేందుకు మరి కొంత సమయం కేటాయించాలని కోరాయి.