సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన వెంకటరమణ విజయవాడ నుంచి రైలులో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. హైటెక్ సిటీకి వెళ్లేందుకు ఓ ఆటోను ఆశ్రయించారు. ఆటోవాలా ఏకంగా రూ.1000 డిమాండ్ చేశాడు. వెంకటరమణకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. సాధారణ రోజుల్లో అయితే రూ.350 కంటే ఎక్కువ ఉండదు. కానీ కోవిడ్ కాలం. పైగా మరి కొద్దిసేపట్లో లాక్‌డౌన్ ఆంక్షలు మొదలవుతాయి.
వెంకటరమణ గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ అడిగిన రూ.1000 ఇవ్వాల్సివచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. ఉదయం 10 గంటల్లోపు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లాలన్నా, ఇతర ఊళ్లకు పోవాలన్నా లేదా ఇతర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, విమానాల్లో నగరానికి చేరుకున్నవాళ్లు గమ్యస్థానాలకు వెళ్లాలన్నా వందల్లో చార్జీలు సమర్పించుకోవాల్సి వస్తోంది.
అడ్డూ అదుపూ లేని ఆటోల దోపిడీ..
► లాక్‌డౌన్ దృష్ట్యా నగరంలో బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. సికింద్రాబాద్ నుంచి బీహెచ్‌ఈఎల్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి పటాన్‌చెరు, ఉప్పల్ నుంచి మెహిదీపట్నం తదితర మార్గాల్లో మాత్రమే ఉదయం 10 వరకు బస్సులు పరిమితంగా నడుస్తున్నాయి.
► నగరం నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే వాళ్లు ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్, నాంపల్లి, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ల వద్ద తిష్ట వేసుకున్న ఆటోలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి.
క్యాబ్‌ల కోసం పడిగాపులు..
► మరోవైపు సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి క్యాబ్‌లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ విధించడంతో వీటి సంఖ్య మరింత
తగ్గింది. గతంలో సుమారు 60 వేల క్యాబ్‌లు అందుబాటులో ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 10 వేల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో ప్రయాణికుల అవసరాలకు సరిపడా క్యాబ్‌లు అందుబాటులో ఉండడం లేదు.
► క్యాబ్ బుక్ చేసుకొనేందుకు 45 నిమిషాల నుంచి గంట వరకు వేచి ఉండాల్సి వస్తోంది. చివరకు బుక్ అయినా పెద్ద మొత్తంలో చార్జీలు చెల్లించాల్సివస్తోంది. సాధారణ రోజుల్లో ఎయిర్‌పోర్టు నుంచి తిరుమలగిరికి వెళ్లేందుకు రూ.800 వరకు క్యాబ్ చార్జీలు ఉంటే ఇప్పుడు రూ.1500 వసూలు చేస్తున్నారు.
జేబులో రూ.500 ఉండాల్సిందే
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి అంబర్‌పేట్‌కు ఆటోలో వచ్చేందుకు రూ.200 తీసుకున్నారు. సాధారణ రోజుల్లో రూ.50 కంటే ఎక్కువ ఉండదు. ఇది లాక్‌డౌన్‌కు ముందు ఉన్న చార్జీ. లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఆటో ఎక్కాలంటే కనీసం రూ.500 జేబులో ఉంచుకోవాల్సిందే. సిటీ బస్సులు సరిపడా లేకపోవడం కూడా కారణమే. – ఓబులేసు, అంబర్‌పేట్
ఆపద సమయంలో ఇదేం దోపిడీ?
కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న ఇలాంటి ఆపత్కాలంలో కూడా ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవడం చాలా దారుణం. ఏ చిన్న అవసరం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చినా సరే సకాలంలో తిరిగి ఇల్లు చేరాలంటే చార్జీల రూపంలో రూ.వందలు చెల్లించుకోవాల్సి వస్తోంది. – నీరూ ఠాకూర్, సామాజిక కార్యకర్త
చదవండి:
అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment