అమలులోకి కొత్త ఆటో చార్జీలు
Published Mon, Aug 26 2013 6:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత చెన్నై నగరంలోని ఆటోలకు మీటర్లు తప్పనిసరి కానున్నాయి. ఆదివారం నుంచి కొత్తచార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస చార్జీగా రూ.25, తర్వాత కిలోమీటరుకు రూ.12 వంతున నిర్ణయించారు. రాత్రుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలతో అధికారులు చార్జీల జాబితా ప్రకటించారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, తిరుచ్చి, సేలం, మదురై తదితర ప్రధాన నగరాల్లో ఆటో చార్జీల మోత మోగుతోంది. చెన్నైలో చార్జీల దోపిడీకి హద్దే లేదని చెప్పవచ్చు. ఏ ఒక్క ఆటోలోనూ మీటర్ కనిపించదు. కూతవేటు దూరానికైనా ఆటోవాలా అడిగినంత చెల్లించాల్సిందే. చార్జీల దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఢిల్లీ, బెంగళూరు తరహా చెన్నైలోనూ చార్జీల్ని ప్రభుత్వమే నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు, ప్రయాణీకుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, ఆటో కార్మిక, యాజమాన్య సంఘాల ప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటైంది. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయూలు సేకరిచింది నివేదికను ముఖ్యమంత్రి జయలలితకు సమర్పించింది.
ఆదేశాలు జారీ: మంత్రులు, అధికారుల బృందంతో ముఖ్యమంత్రి జయలలిత రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆటోచార్జీల్ని అమలు చేయడానికి నిర్ణయించారు. ఆదివారం నుంచే ఈ చార్జీలు అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు వెలువడ్డాయి. తరచూ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రయాణీకుల సంక్షేమం, భద్రతను పరిగణనలోకి తీసుకుని కొత్త ఆటో చార్జీల్ని నిర్ణయిం చినట్లు జయలలిత పేర్కొన్నారు.
ఇదీ జాబితా
= కనీస చార్జీగా రూ.25 నిర్ణయించారు. 1.8 కిలోమీటర్ల అనంతరం ప్రతి కిలోమీటర్‌కు రూ.12 చార్జీ వసూలు చేయనున్నారు.
= రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మీటరుపై యాభై శాతం అదనపు చార్జీ వసూళ్లు చేసుకోవచ్చు.
= ప్రతి ఐదు నిమిషాలకు వెయిటింగ్ చార్జీగా రూ.3.50 నిర్ణయించారు. గంట వెయింటిం గ్‌కు రూ.42 వసూళ్లు చేయనున్నారు.
= ఆదివారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రావాలి. సెప్టెంబరు పదిహేనులోపు పూర్తిస్థాయిలో అన్ని ఆటోల్లో అమలు చేయాలి. ఆటో చార్జీల వివరాలతో కూడిన మీటర్లను ఆయా డివిజన్ల పరిధిలోని రవాణా కార్యాలయాల్లో స్వీకరించుకోవచ్చు.
= దేశ చరిత్రలో ప్రప్రథమంగా ఆటోలకు జీపీఎస్ పరికరం, ఎలక్ట్రానిక్ బిల్లింగ్ యంత్రం తో కూడిన మీటర్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మీటర్ల కొనుగోలుకు రూ.80 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆటో ఎక్కడికి వెళుతోంది, ఏ ప్రదేశంలో ఉంది తదితర వివరాలను జీపీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. మీటరకు తగ్గ చార్జీని రశీదు రూపంలో అందుకుని చెల్లించే అవకాశం ఇచ్చారు.
= ఆటోలో ప్రయాణించే సమయంలో ఏదేని ప్రమాదం చోటు చేసుకున్నా, ఆటోవాల రూపంలో ఏదేని ముప్పు ఎదురైనా పోలీసుల్ని అప్రమత్తం చేసే రీతిలో ప్రత్యేక సౌకర్యం కల్పించనున్నారు. ప్యానిక్ బటన్‌ను ఆటోమీటర్ల వద్ద అమర్చనున్నారు. ఈ బటన్‌ను నొక్కిన పక్షంలో కంట్రోల్ రూమ్‌కు ఏ ఆటో నుంచి, ఏ సమయంలో, ఏ ప్రదేశం నుంచి.. అన్న వివరాలతో ప్రమాద హెచ్చరిక సమాచారం చేరుతుంది.
= ఆటోచార్జీల అమలుపై పర్యవేక్షణకు పోలీసులు, రవాణాశాఖ అధికారులతో బృందాలు నియమించనున్నారు. ఆటోచార్జీలు అధికంగా వసూళ్లు చేసిన పక్షంలో సంబంధిత డ్రైవర్ లెసైన్సు, ఆటో రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
అంగీకారం: ప్రభుత్వం ప్రకటించిన చార్జీల పట్ల ఆటో సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఆటో చార్జీల ప్రకటనతో కార్మిక సంఘాలు గిండిలో ఆదివారం సమావేశమయ్యాయి. కొత్త చార్జీల్ని అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. చార్జీల్లో ప్రతి ఏటా మార్పులు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధర పెరిగినప్పుడల్లా చార్జీల్ని పెంచాలని, ఇందు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే మీటర్లు అమర్చేందుకు మరి కొంత సమయం కేటాయించాలని కోరాయి.
Advertisement
Advertisement