
ఎంబీసీలంటే ఎవరంటారా?
‘‘ఎంబీసీలు అంటే ఎవరు.. వారికి రూ.1000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని జానారెడ్డి అడిగారు..
ఇదేనా ప్రధాన ప్రతిపక్ష నేత అడిగే ప్రశ్న: సీఎం ఫైర్
⇒ బడ్జెట్‌లో వృత్తులకు ప్రాధాన్యమిస్తే హేళనగా మాట్లాడుతున్నారు
⇒ డిస్కంల అప్పులపైనా అలాగే అంటున్నారు
⇒ అప్పు చేయడం తప్పు కాదు..
⇒ మన రాష్ట్రాన్ని మనమే శపించవద్దు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎంబీసీలు అంటే ఎవరు.. వారికి రూ.1000 కోట్లు ఎలా ఖర్చు చేస్తారని జానారెడ్డి అడిగారు.. ఇదేనా ప్రధాన ప్రతిపక్ష నేత అడిగే ప్రశ్న? బడ్జెట్‌లో వృత్తుల వారు తాము కనబడుతున్నామని అనుకుంటుంటే ప్రధాన ప్రతిపక్షం హేలనగా మాట్లాడుతోంది. డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే... ఇంకా అప్పులని మాట్లాడుతున్నారు.. ప్రతిపక్ష నాయకుని పరిజ్ఞానానికి వందనాలు..’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నేత జానారెడ్డిపై ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం వివిధ సందర్భాల్లో జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిన్నారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు.
డిస్కంల రూ.12 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడంతో అవి ఏటా చెల్లించే రూ.820 కోట్ల వడ్డీ భారం తగ్గిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచాలంటే తాను ఒప్పుకోలేదని, వడ్డీ భారం తగ్గించామని, చార్జీలు పెంచవద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇన్ని చేస్తుంటే డిస్కంలకు అప్పులు అంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాన ప్రతిపక్షం తీరుతో బాధ కలిగి ఈ మాటలు చెబుతున్నానన్నారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు రాష్ట్రం కోసం 1000 మెగావాట్ల కారిడార్ బుక్ చేయమంటే చేయలేదు. ఇప్పుడేమో 2 వేల మెగావాట్ల కారిడార్ అనవసరం అని మాట్లాడుతున్నారు. భవిష్యత్ అవసరాలపై అవగాహనతోనే మేం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకున్నాం.
పీపీఏలు ఉంటేనే కారిడార్ కేటాయింపు ఉంటుంది. అప్పులు అనడం ప్రగతి విషయంలో అవగాహన లేని వారు చెప్పే మాటలు’’అని సీఎం అన్నారు. తాము ఏటా రూ.20 వేల కోట్ల అప్పులు చెల్లిస్తున్నామని, చెల్లింపులను బట్టే అప్పులు తీసుకుంటున్నామన్నారు. అప్పు చేయడం తప్పు కాదని, అనుకున్న అభివృద్ధి సాధించాలంటే క్వాంటమ్ జంప్ తీసుకోవాలని ప్రధాని మోదీనే చెబుతున్నారన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నర్సింగరావును సింగరేణి ఎండీగా పెట్టామని, అప్పటి కేంద్రమంత్రి శిబూసోరెన్ గదువ పట్టుకొని బతిమిలాడి ఒప్పించి 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అనుమతులు సాధించామని వివరించారు. ‘‘అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తట్టుకోలేక కేటీపీపీ పెట్టారు. బడ్జెట్ రూపకల్పన విధానం కేంద్రం, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లే మన దగ్గరా ఉంది. బడ్జెట్ అంచనాలకు, సవరణ అంచనాలకు మధ్య వ్యత్యాసం 15 శాతం నుంచి 25 శాతం ఉంటుంది. మన కొత్త రాష్ట్రాన్ని మనమే శపించవద్దు’’అని పేర్కొన్నారు.
కేంద్రానిది అణా పైసా లేదు
గొర్రెల పెంపకం పథకం విషయంలో కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. ‘‘అది కేంద్ర పథకమని, కేంద్రం డబ్బు ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ అది కేంద్ర పథకమే కాదు. ఎన్‌సీడీసీ అనేది రుణాలిచ్చే సంస్థ. 10.3 శాతం వడ్డీకి రుణాలు తెస్తున్నాం’’అని చెప్పారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కల్పించుకొని... అది మొత్తం కేంద్రం పథకమని తాను అనలేదని, కేంద్రం కొంత డబ్బు ఇస్తోందని చెప్పానని పేర్కొన్నారు. అందుకు సీఎం బదులిస్తూ.. అందులో కేంద్రానిది అణా పైసా కూడా లేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బేనని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి తనకు మంచి మిత్రుడని, కానీ గొర్రెల పెంపకం, పందుల పెంపకం అంటూ హేళనగా మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. పేపర్లు అడ్డుపెట్టుకొని నవ్వడం కాదని, సంపద సృష్టించడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో 33 శాతం పౌల్ట్రీ ఉత్పతి, 40 శాతం ఫార్మా ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే ఉందన్న సంగతిని గ్రహించాలన్నారు.
కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని చైనా కూడా పక్కనపెట్టింది
కమ్యూనిస్టు సిద్ధాంతంపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు సీఎం వివరణ ఇస్తూ.. ‘చైనా కూడా కమ్యూనిజం సిద్ధాంతాలు పనికిరావని పక్కన పెట్టి అభివృద్ధి సాధించింది. అమెరికాతో పోటీ పడుతోంది’అన్నారు. సీఎం వ్యాఖ్యలపై సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. ‘కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచంలోనే మంచి సిద్ధాంతం. అది పనికి రాదన్నట్లు మాట్లాడటం బాధ కలిగించింది’అని పేర్కొన్నారు. వెంటనే సీఎం మాట్లాడుతూ.. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తానేమీ తప్పు పట్టలేదన్నారు. ‘నిజంగానే ప్రపంచంలో కమ్యూనిస్టు సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం లేదు. అయితే మావో, లెనిన్ చెప్పినట్లు అది పరిణామ లంగా ఉండాలి.
వాళ్లు చెప్పింది పాటించకపోవటం వల్లే భారత కమ్యూనిస్టు పార్టీలకు ఈ పరిస్థితి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీలు జడత్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయి. దీనికో ఉదాహరణ చెబుతా. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టినప్పుడు హెచ్‌ఐసీసీలో సదస్సు ఏర్పాటు చేశాం. మురికిని ఎత్తిపోసే సఫాయి కార్మికులు తల్లిదండ్రుల్లాంటి వారు. సఫాయన్నా నీకు సలామన్నా.. అని గొప్పగా మాట్లాడుకున్నాం. వాళ్ల జీతాలు పెంచుతామని సీఎం హోదాలో నేనే ప్రకటించా.. సరిగా నాలుగో రోజే కమ్యూనిస్టుల అనుబంధ సంఘం సీఐటీయూ సమ్మెకు నోటీసిచ్చింది. ఇదీ కమ్యూనిస్టుల పంథా. సీఎంగా నేనిచ్చిన మాటకు విలువ లేదా.. సమ్మె చేస్తే ఏమొచ్చింది’అని సీఎం వివరించారు.