మ.3 గంటలకు ప్రత్యూషను కలవనున్నకేసీఆర్
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సతీసమేతంగా కలవనున్నారు. కాగా మీడియాలో ప్రత్యూషపై వచ్చిన కథనాలు చూసి కేసీఆర్ చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.
తల్లిని కోల్పోయిన ప్రత్యూషను ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష పరిస్థితి తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. దీంతో ప్రత్యూష కు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్ప పొందుతున్న ప్రత్యూషను ఆయన కలవనున్నారు. కాగా ఉదయం 10 గంటలకు ప్రత్యూషను కేసీఆర్ దంపతులు కలవాల్సి ఉన్నా నగరంలో పుష్కరాల వాహనాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు.
కాగా నగర శివార్లలో ఏర్పడిన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వారాంతంతో పుష్కరాలకు భక్తుల రద్దీ పెరగడంతో పుష్కర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. టోల్ గేట్ల వద్ద ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ఘాట్ల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల పాటు ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు , పడవలు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.