♦ చలిలో ఎలా..? నైట్ షెల్టర్లు లేక అవస్థలు
♦ జీహెచ్‌ఎంసీ సిద్ధమైనా.. అంగీకరించని ఆస్పత్రులు
♦ వణుకుతున్న రోగుల బంధువులు
ఒక్కసారిగా విజృంభించిన చలితో నగరం వణుకుతోంది. శనివారం శీతల గాలులు మరింత పెరిగాయి. ఒక్క రోజు వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రత 17.5 నుంచి 12.5 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం 9.30 గంటలు వరకూ బయటకు రాలేని పరిస్థితి. సాయంత్రం 5 గంటలు దాటితే కాలు బయట పెట్టలేని స్థితి ఎదురవుతోంది. మరోవైపు నగరంలోని ఆస్పత్రుల వద్ద నైట్ షెల్టర్లు లేక... రోగుల బంధువులు రాత్రంతా చలితో గజగజలాడుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: అసలే చలి కాలం. ఆపై వణికిస్తున్న శీతల గాలులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చిన వారిని వణికిస్తున్నాయి. మరోవైపు దోమలు తినేస్తున్నాయి. తల దాచుకుందామంటే ఆస్పత్రుల వద్ద నిలువ నీడ ఉండదు. దీంతోరోగుల బంధువుల అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి వారి కోసం రాత్రి బస కేంద్రాల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ముందుకు వచ్చింది. ఒక్కోదానికి రూ.5.50కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. స్థలాలను కేటాయించాల్సిందిగా లేఖలు రాయ గా... నిమ్స్, సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు నిరాకరించాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిలోఫర్ న వజాత శిశువుల ఆస్పత్రి, కోఠి మెటర్నిటీ, ఈఎన్‌టీ ఆస్పత్రులు స్థలాలు కేటాయించాయి. దీంతో అక్కడ వసతి కేంద్రాలకు పునాదులు పడ్డాయి. మరో ఆరు నెలల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఒక్కో ఆస్పత్రి ముందు వెయ్యి మందికిపైనే...
ఉస్మానియా ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 1200 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సాయంగా మరో 1200 మంది ఇక్కడే ఉంటారు. నిలోఫర్‌లో వెయ్యి మంది శిశువులు చికిత్స పొందుతుంటారు. వీరికి సాయంగా 1500 మంది ఉంటారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో 500 మంది చికిత్స పొందుతుం డగా... మరో 150-200 మంది రేడియేషన్ కోసం అక్కడే ఎదు రు చూస్తుంటారు. గాంధీలో 1500-2000 మంది రో గులు.... మరో 1500 మంది సహాయకులు ఉంటారు.
సుల్తాన్‌బజార్,పేట్లబురుజు ప్రభు త్వ ఆస్పత్రుల్లో వెయ్యి మంది వరకు ఉంటారు. రోగుల సహాయకులకు సరైన వసతి లేకపోవడంతో వీరంతా చెట్ల కిందే తల దాచుకుంటున్నారు. మరుగు దొడ్లు లేవు.
ఇన్‌పేషెంట్లకు ఇవ్వరు
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి.. చిరిగిపోయిన దుప్పట్లే దర్శనమిస్తున్నాయి. శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గాంధీలో సరిపడే దుప్పట్లు ఉన్నా రోగులకు ఇవ్వడం లేదు. పొరపాటున ఎవరై నా దుప్పటి తెచ్చుకోకపోతే రాత్రంతా ఇబ్బంది పడాల్సిందే. నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో మంచాలే కాదు... దుప్పట్లు కూడా లేకపోవడంతో శిశువులు వణికిపోతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రభుత్వం నిధులు కేటాయించినా... దుప్పట్ల కొనుగోలుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు. దీన్ని బట్టి రోగులపై వారికి ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు.