ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశారు.
నాంపల్లి: ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ సిరిబాబు అనే బీసీ సంఘం నేత ఆత్మ బలిదానం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లాకు చెందిన సిరిబాబు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా 50 శాతం కాలిన గాయాలతో నగరంలోని యశోద ఆస్పత్రికి తరలిస్తే పోలీసులతో గెంటివేశారని ఆ ఫిర్యాదులో వివరించారు.
మరిన్ని ఆత్మ బలిదానాలు కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ మెదక్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబరు 1వ తేదీలోగా సమగ్ర నివేదికను అందజేయాలని కోరింది.