ఈనెల 24, 25 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్, 26న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
26న కేబినెట్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24, 25 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్, 26న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మొదటి వారంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని మొదట భావించినప్పటికీ మహా నాడుకు ముందే అన్ని పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో కలెక్టర్ల కాన్ఫరెన్సు 24, 25 తేదీల్లోనూ, కేబినెట్ సమావేశం 26న నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. వర్షాకాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో విపత్తులు - సన్నద్ధత, ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక, ఎరువులు, విత్తనాల పరిస్థితి, వర్షాకాలం వ్యాధులు.. నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమలకు భూ సేకరణ, రెవెన్యూ అంశాలు, నాలా పన్ను, భూ వినియోగ మార్పిడి తదితర అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చిస్తారు.
కేబినెట్ సమావేశంలో...
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనానికి ఉద్యోగుల తరలింపు, 2015లో వరదలు, కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.990 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిల విడుదల, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, రాష్ట్ర పునర్వ్యవవస్థీకరణ చట్టంలోని హామీలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో సీఎం జరిపిన చర్చలు, కేంద్రం వైఖరి తదితర అంశాలు మంత్రి వర్గ సమావేశం అధికారిక, అనధికారిక ఎజెండాలో ఉండనున్నాయి.