
సాగు ప్రాజెక్టులపై సమీక్ష
కేబినెట్ భేటీలో చర్చించనున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్షకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, చేపడుతున్న ప్రాజెక్టులపై క్షుణ్ణంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ప్రాజెక్టులవారీగా జరిగిన పనులు, చేసిన ఖర్చు, అవసరమైన నిధులు, అందించిన ఆయకట్టు, మిగిలిన లక్ష్యాలపై నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అంశంపై నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ మంగళవారం ఈఎన్‌సీ మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లతోపాటు ఇతర అధికారులతో మూడు గంటలపాటు సమీక్షించారు.
ఈ ఏడాది పెద్ద, మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 30 లక్షల ఆయకట్టుకు నీరందేలా ప్రణాళికలు సాగుతున్నా ఇంకా కొన్ని ప్రాజెక్టుల పనులు పట్టాలెక్కిల్సి ఉంది. ఇందులో తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల రెండో దశ, ఇందిరమ్మ వరద కాల్వ, ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వంటివి ఉన్నాయి. వీటికితోడు నిర్మాణంలో ఉన్న 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా అదనపు చెల్లింపులు (ఎస్కలేషన్) చేసేందుకు ప్రభుత్వం జీవో–146 తెచ్చినా పనులు ఆశించినట్లుగా జరగట్లేదు. ఏడాది కాలంలో 78 ప్యాకేజీల్లో కేవలం 13 శాతం పనులే జరిగాయి. గతేడాది బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించినా వివిధ కారణాలతో రూ. 9,500 కోట్ల ఖర్చు మాత్రమే జరిగింది. ఈ అంశాలన్నింటిపై సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.