
సర్కారు కొత్త సంప్రదాయం
ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆదివారం అంటే అందరికీ ఆటవిడుపు.. సెలవు దినం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం అచ్చొచ్చినట్లుంది. ఇటీవల వరుసగా మంత్రివర్గ భేటీలను ఆదివారం నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా ఆదివారం కొనసాగించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలతో చర్చించి ఆమోద ముద్ర కూడా వేయించింది. ఈనెలాఖరు వరకు జరిగే బడ్జెట్ సమావేశాల వ్యవధిలో వచ్చే మూడు ఆదివారాలను పనిదినాలుగా గుర్తించడం గమనార్హం.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కేబినెట్ మీటింగ్‌లతో పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో అసెంబ్లీకి శని, ఆదివారాలు సెలవులుండేవి. ఈ రెండ్రోజులు ఉద్యోగులకు సెలవు దినాలు కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలకు వెళ్లే వీలుండేది. కానీ తాజా నిర్ణయంతో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు వీరందరూ పని చేయాల్సిందే. సహజంగానే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు సాధారణ పరిపాలనా విభాగంతో పాటు సచివాలయ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తారు.
అవసరమైన సమాచారంతో నిత్యం అందుబాటులో ఉండాలని ఇప్పటికే సంబంధిత విభాగాల అధికారులు ఉద్యోగులందరికీ సర్క్యులర్ జారీ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏప్రిల్ ఒకటికి ముందే బడ్జెట్‌కు సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభ ఆమోదం పొందటం తప్పనిసరి. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం నిధులు డ్రా చేయడానికి వీలుండదు. అందుకే సెలవు రోజులతో సంబంధం లేకుండా పదహారు పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాల్సి ఉందని ప్రభుత్వం లెక్కలేసుకుంది. ఈ నేపథ్యంలోనే శని, ఆదివారాలు పనిదినాలుగా మార్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ సైతం రేపు (ఆదివారం) సాయంత్రమే జరగనుండటం కొసమెరుపు.