హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని అటు అధికార... ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఓరుగల్లును తమ ఖాతాలో వేసుకుని అధికార టీఆర్ఎస్కు చెక్ చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూహా రచన చేస్తుంది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది.
దీంతో కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజయ్ సింగ్, సుశీల్కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్తోపాటు లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ నేతలంతా 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక నవంబర్ 21న జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.