రుణాలిచ్చేదెప్పుడు?
శాసనసభలో ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల ఫైర్
- స్వయం ఉపాధి రుణాల కోసం యువతలో ఆందోళన
- సామాజిక, బంగారు తెలంగాణ రావాలనుకోవడం లేదా?
- ఇతర పథకాలకు అప్పులు తెచ్చి నిధులిస్తున్నారు..దీనికి కేటాయించినవి కూడా ఇవ్వరా?
- ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జానా, కోమటిరెడ్డి, వంశీ యత్నం
- ముఖ్యమంత్రి రంగప్రవేశంతో ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వం
- మార్చి 31 కల్లా రూ.550 కోట్ల వరకు విడుదల చేస్తామన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విరుచుకుపడింది. రెండున్నరేళ్లలో ఆయా వర్గాలకు స్వయం ఉపాధి రుణాలిచ్చేం దుకు రూ.2,900 కోట్లు కేటాయించినా.. కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశా రని మండిపడింది. ప్రభుత్వ తీరుతో తెలంగాణలో 80 శాతంగా ఉన్న బడుగు వర్గాల యువతకు ఉపాధి కష్టమవుతోందని స్పష్టం చేసింది. ఇలా చేస్తూ తెలంగాణను ఎటు తీసుకెళదామనుకుంటున్నారని, ఏం చేద్దామనుకుంటున్నారని నిలదీసింది. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం లో ఈ అంశంపై చర్చ జరింది.
తొలుత సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. 2014–15, 2015–16 సంవత్సరాలకు సంబం ధించిన సబ్సిడీ రుణాల ప్రక్రియ ఇంతవరకు పూర్తి చేయలేదని.. 2016–17కు సంబంధించి అసలు ప్రక్రియనే ప్రారంభించలేదని పేర్కొ న్నారు. కేటాయించిన నిధుల్లో 25 శాతం మేర ఖర్చయ్యాయని ప్రభుత్వమే చెపుతున్నా.. అం దులో సగం కూడా గ్రౌండింగ్ కాలేదన్న వాస్త వాన్ని గుర్తించలేదా అని నిలదీశారు. మాటలు, కబుర్లతో ప్రభుత్వం సరిపెడుతోందని, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. అదేం లేదని ప్రభుత్వ చర్యల తో అర్థమవుతోందని విమర్శించారు. ప్రజల ను ఎక్కువ రోజులు మోసం చేయలేరని, ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు క్షమించే పరిస్థితి లేదన్నారు. గత రెండేళ్లలో మిగిలిన స్వయం ఉపాధి నిధులను కూడా కలిపి ఈ ఏడాది ప్రక్రి యను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగా లివ్వకపోగా.. స్వయం ఉపాధి కోసం రుణాలు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ మరో సభ్యుడు వంశీచంద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం ఆయా వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మార్చి 31 కల్లా పెండింగ్ నిధులిస్తాం: కేసీఆర్
విపక్షాల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. గత రెండేళ్లకు కలిపి స్వయం ఉపాధి రుణాల కోసం మార్చి నాటికి రూ.550 కోట్లు విడుదల చేయాల్సి ఉందని.. మార్చి 31 నాటికి ఆ నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇతర ఖర్చులైవనా తగ్గించు కుని అయినా విడుదల చేస్తామన్నారు. అదే విధంగా ఎస్సీ సబ్‌ప్లాన్ కూడా ఉందని, ఈ ఏడాది బడ్జెట్‌లో మార్పులు చేయాలని కేంద్రం సూచించిందని, ఆ మార్పులకు అనుగుణంగా ఎలాంటి కొత్త పథకాలు పెట్టాలో కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ‘ఈసారి ప్లాన్, నాన్‌ప్లాన్ బడ్జెట్ పెట్టే అవ కాశం లేదు. కేపిటల్, రెవెన్యూ ఖర్చు పద్ధతి లో బడ్జెట్ పెట్టాలని కేంద్రం చెబుతోంది. దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఢిల్లీ వెళ్లి మాట్లాడారు. ఆ మేరకు బడ్జెట్‌లో మార్పు లు చేయాల్సి ఉంటుంది’అని చెప్పారు. ఈ నెలాఖరులోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో తానే సమావేశమై ఆయా వర్గాలకు ఎలాంటి పథకాలు పెట్టాలో నిర్ణయిస్తామన్నారు.
మేమే ఇవ్వొద్దన్నాం..: ఈటల
కాంగ్రెస్ సభ్యులు మాట్లాడిన అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు. తామెవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు క్షమాపణలు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని వ్యాఖ్యానించారు. సత్యాలు దాగవని, లెక్కలు ఎటూ పోవని... 2016–17లో కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరును నిలిపివేయాలని తామే సూచించామని చెప్పారు. గత రెండేళ్లలో మంజూరైన యూనిట్లు పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ కాలేదని.. అవి పూర్తయ్యాకే 2016–17 యాక్షన్ ప్లాన్‌కు వెళ్లాలన్నామని తెలిపారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో ఏ శాఖ కింద ఎంత మంది లబ్ధిదారులకు నిధులు మంజూరు చేశారనే లెక్కలను వివరించారు.
అది గొప్పతనమనుకుంటున్నారా?: జానారెడ్డి
మంత్రి ఈటల సమాధానంపై సీఎల్పీ నేత కె.జానారెడ్డి మండిపడ్డారు. ‘‘బలహీన వర్గాలకు స్వయం ఉపాధి రుణాలను తామే నిలిపివేయాలన్నామని చెప్పడం గొప్పనుకుంటున్నారా? గతేడాది ఇచ్చిన యూనిట్లు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది నిలిపివేస్తున్నామనడం సమంజసమేనా? అసలు గత రెండేళ్లలో మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా?..’’అని ఆయన నిలదీశారు. వెంటనే మూడేళ్ల యూనిట్ల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి ఈటల స్పందిస్తూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో స్వయం ఉపాధి రుణాల కోసం రూ.372 కోట్లు ఇస్తే... తాము రెండున్నరేళ్లలోనే రూ.1,402 కోట్లు విడుదల చేశామన్నారు. సబ్సిడీ మొత్తాన్ని కూడా పెంచామన్నారు.
ఈ సమయంలో కోమటిరెడ్డి మరోసారి జోక్యం చేసుకున్నారు. సబ్సిడీ మొత్తాన్ని పెంచగానే నిరుద్యోగుల కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ బడ్జెట్ రూ.1.2 లక్షల కోట్లయితే, ఇప్పుడు తెలంగాణ బడ్జెటే రూ.1.3 లక్షల కోట్లని... పెట్టారని అలాంటప్పుడు సబ్సిడీ మొత్తాన్ని పెంచామని చెప్పుకుంటే ఎలాగని నిలదీశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కూలీ రోజుకు ఒక్క రూపాయి ఉందని.. ఇప్పుడు రోజుకూలీ రూ.500 అయిందని జానారెడ్డి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మేం రూ.500 కూలీ ఇస్తున్నామని చెబితే గొప్పేమిటని ఎద్దేవా చేశారు. ఏమీ చేయకుండానే ప్రచారం చేసుకుంటున్నారని, ఇదేమని అడిగితే దబాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు రుణాలు తెచ్చి మరీ నిధులిస్తోందని.. కానీ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కేటాయించిన డబ్బులు ఇవ్వడం లేదని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఈ వర్గాలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ సభలోకి వచ్చి ప్రభుత్వం తరఫున సమాధానమిచ్చారు.