వైఎస్ బాటలో అధికారంలోకి వస్తాం
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం అంటే ఎలా ఉండాలో, ఆచరణలో చూపించిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించిన గొప్ప నేత అని కొని యాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతి వేడుకలను టీపీసీసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. హైదరాబాద్‌లోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీభవన్‌లోనూ, ఇందిరాభవన్‌లోనూ జరిగిన జయంతి వేడుకల్లో ఉత్తమ్ ప్రసంగించారు. వైఎస్ స్ఫూర్తితో, ఆయన బాటలో నడుస్తూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామన్నారు. విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన ఘనత వైఎస్‌దేనని అన్నారు.
వైఎస్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించా రని, ప్రస్తుత పాలకులు ప్రజలకు దూరంగా, భారీ భవనాల్లో ఉంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, టీపీసీసీ కిసాన్‌సెల్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రాజెక్టులతో టీఆర్‌ఎస్ గొప్పలు
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యుత్ ప్లాంటుకు శంకుస్థాపన చేసి, పూర్తిచేశారో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పు డు మొదలు పెట్టి, 90% దాకా పూర్తిచేసిన ప్లాంట్లను టీఆర్‌ఎస్ పూర్తిచేసినట్టుగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పులిచింతల, జైపూర్, భూపాలపల్లి విద్యుత్ ప్రాజెక్టులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొదలు పెట్టినవేనన్నారు. కాంగ్రెస్ అధికా రంలో ఉన్నప్పుడే పూర్తికావొచ్చిన విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించి, తానే మొత్తం పూర్తిచేసినట్టుగా టీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నదని విమర్శించారు.