
వర్గీకరణ కోసం మాదిగల ఎదురుచూపు
► ఎమ్మార్పీఎస్ దీక్షా శిబిరంలో
ఎంపీ నంది ఎల్లయ్య
న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ పల్లెలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నాయని, మాదిగల ఆకాంక్షను గుర్తించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడి జంతర్‌మంతర్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ మహాదీక్ష 8వ రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం ఎలాంటి త్యాగానికైనా మాదిగ యువత సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పుడు మాదిగలు వర్గీకరణ ఫలాలు అనుభవిస్తుండేవారన్నారు. మాదిగజాతి ఆత్మగౌరవ చిహ్నంగా మంద కృష్ణ నిలిచారన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వర్గీకరణ కోసం తపిస్తున్నానన్నారు. ఉద్యమం అంతిమదశకు చేరిందని, అందరం ఐక్యంగా ఉండి వర్గీకరణను సాధించుకోవాలని టీపీసీసీ ఎస్సీసెల్‌చైర్మన్ ఆరేపల్లి మోహన్ పిలుపునిచ్చారు. 8 వరోజు దీక్షలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.