సెంటిమెంట్ల కోసం ప్రజాధనం వృథా
సెంటిమెంట్ల కోసం ప్రజాధనం వృథా
Published Fri, Nov 11 2016 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సచివాలయం ముట్టడికి పీసీసీ యత్నం
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలువురి అరెస్టు
కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని వ్యక్తిగత మూఢ విశ్వాసాల కోసం కూల్చొద్దంటూ పీసీసీ గురువారం ఉద్యమించింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ముఖ్య నేతల నేతృత్వంలో పార్టీ శ్రేణులు.. సచివాలయం ముట్టడికి యత్నించాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు డి.కె.అరుణ, జి.చిన్నా రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీసీసీ నేతలు సర్వే సత్యనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఆరేపల్లి మోహన్, నేరెళ్ల శారద, అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్ తదితరులు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు.
సచివాలయాన్ని కూల్చివేసి, రూ.వందల కోట్లు ఖర్చుతో కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సచివాలయం వైపు దూసుకుపోయారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. షబ్బీర్ అలీ, సంపత్ కుమార్‌లను పోలీసులు నెట్టివేశారు. కొద్దిసేపు తోపులాట అనంతరం పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన పార్టీ నేతలను గాంధీనగర్, ఆబిడ్‌స, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, మంచిగా ఉన్న సచివాలయాన్ని కూల్చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గమని విమర్శించారు. సీఎం తీసుకున్న చర్య వల్ల రూ.వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఈ సచివాలయానికి వాస్తు బాగాలేదని, అందులోకి వచ్చిన వారు ఎవరూ పొడుగు కాలేద వ్యాఖ్యానించడం అనుచితమన్నారు.
ఒక్క కేసీఆర్‌కే ఎందుకు అభద్రత
ఇదే సచివాలయం నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్నో ఏళ్లు పాలన సాగించారని, ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందాయని ఉత్తమ్ చెప్పారు. అగ్నిమాపక జాగ్రత్తల్లేవని, పాత భవనాలని చెబుతూ కోర్టును కూడా ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు. ఇదే సచివాలయం లో జడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుతో సహా చాలా మంది సీఎంలుగా పని చేశారని గుర్తు చేశారు. వారికి లేని అభద్రత ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఎందుకొచ్చిందని ప్రశ్నిం చారు. సచివాలయంలోని కొన్ని భవనాల నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయిందని, అవి ఎట్లా పాతవో చెప్పాలన్నారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల్లేవంటున్న ప్రభుత్వం రూ.వందల కోట్లను మూఢ విశ్వాసాల కోసం, వ్యక్తిగత సెంటిమెంట్ల కోసం వృథా చేస్తున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీకి బకారుులు, అభయహస్తం పించన్లు, హాస్టళ్ల నిర్వహణ, ఉపాధి హామీ కూలీల బకాయిలను చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటూ కొత్త సచివాలయం కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేయాలనుకోవడం ప్రజా వ్యతిరేకమన్నారు.
Advertisement