
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కార్యక్రమం ముహూర్తం కన్నా రెండ్రోజుల ముందే ప్రారంభమైంది! సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల నుంచి వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల కరెంట్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి సరఫరా, పంపిణీ వ్యవస్థల సన్నద్ధతలను పరీక్షించి చూశారు.
రాష్ట్రంలో 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం కావడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. రైతులంతా ఉదయం పూటే పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు పంపు సెట్లను ఆన్ చేయడంతో శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 9,379 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. పంట పొలాలకు రైతులు నీళ్లు పెట్టే సాధారణ వేళలైన ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది.
గురువారం రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 8,283 మెగావాట్లుగా నమోదు కాగా.. 24 గంటల సరఫరా తర్వాత ఇది 9,379 మెగావాట్లకు ఎగబాకింది. తొలిరోజు అక్కడక్కడ సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలిగినా.. రెండుమూడ్రోజుల్లో సర్దుకుంటుందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస సీఎండీ జి.రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముందస్తు సన్నాహాల్లో భాగంగానే రెండ్రోజుల ముందు 24 గంటల సరఫరా ప్రారంభించామని, అధికారికంగా సరఫరా జనవరి 1 నుంచి ప్రారంభిస్తామన్నారు.
రివర్స్ విధానంలో జల విద్యుదుత్పత్తి
పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు శ్రీశైలం జల విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద రివర్స్ పంపింగ్ విధానంలో ఉత్పత్తిని ప్రారంభించారు. పగటి పూట వినియోగం భారీగా పెరిగి, రాత్రి వేళల్లో డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో రాత్రి పూట మిగిలిపోతున్న విద్యుత్‌తో శ్రీశైలం జలాశయంలో నీళ్లను వెనక్కి తోడి, పగటి పూట రివర్స్ పంపింగ్ విధానంలో విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment